INAUGURATION OF CME ON PANCHAKARMA & DRAVYAGUNA _ ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి జాతీయస్థాయి తెచ్చేందుకు కృషి : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి జాతీయస్థాయి తెచ్చేందుకు కృషి : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
తిరుపతి, ఏప్రిల్ 15, 2013: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఆస్పత్రికి జాతీయ స్థాయి కల్పించేందుకు కృషి చేస్తామని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో నిరంతర వైద్య విద్యా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు కొనసాగనుంది.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఛైర్మన్ ప్రసంగిస్తూ ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు దేశంలోనే ప్రముఖ కళాశాలగా గుర్తింపు ఉందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, బోధిస్తున్న అధ్యాపకులు, డాక్టర్లు సమాజానికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కళాశాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిరంతర వైద్య విద్యా కార్యక్రమంలో అధ్యాపకులు మరింత నైపుణ్యాన్ని పెంచుకుని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని కోరారు. ఈ సందర్భంగా ”పంచకర్మ నిరంతర వైద్య విద్య” సావనీర్‌ను ఛైర్మన్ ఆవిష్కరించారు.
తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తితిదేలో ఆయుర్వేద విభాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, పవిత్రమైన తిరుమల గిరుల్లో 500 రకాలకు పైగా ఆయుర్వేద మొక్కలున్నాయని తెలిపారు. ఆలయాల ఉత్సవాలు, పర్వదినాల్లో ఆయుర్వేద ఆస్పత్రి తరఫున వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి భక్తులకు వైద్య సేవలందిస్తున్నారని కొనియాడారు. సమాచార విప్లవం నేపథ్యంలో విజ్ఞాన సముపార్జనకు ఎంతో అవకాశముందని, ఆయుర్వేద విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన రాజస్థాన్‌లోని ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్.హెచ్.సింగ్ ప్రసంగిస్తూ విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని విషయాలకే పరిమితం కాకూడదని, పరిశీలన, పరిశోధన ద్వారా బయటి ప్రపంచం నుండి విజ్ఞానాన్ని ఆర్జించాలని సూచించారు. ఇలాంటి విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తే మంచి ఫలాలు అందుతాయన్నారు.
జెఈవో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంతకుముందు స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాజయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతి, అధ్యాపకులు డాక్టర్ ఎ.శంకర్‌బాబు, డాక్టర్ ఎం.పరాంకుశరావు ప్రసంగించారు. అనంతరం తితిదే ఛైర్మన్, జెఈఓ, ఇతర అతిథులను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామిరెడ్డి, ఇతర అధ్యాపకులు, శిక్షణ డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.