Inauguration of New TTD Press Building in Tirupati _ నూతన ముద్రణాలయ భవనంను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
నూతన ముద్రణాలయ భవనంను ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
తిరుపతి, 2010 జూన్ 24: దాదాపు 75 వసంతాలు పూర్తి చేసుకున్న తితిదే ముద్రణాలయం భక్తులకు అవసరమైన సకల సమాచారాన్ని అందించడంలో ఎనలేని కృషి చేస్తున్నదని తితిదే పాలకమండలి ఛైర్మన్ శ్రీ డి.కె. ఆదికేశవులు అన్నారు. గురువారం ఉదయం ఆయన ప్రెస్ కాంపౌండ్ నందు తితిదే నూతన ముద్రణాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 1933వ సంవత్సరంలో మద్రాసు నగరంలో మొట్టమొదట సారిగా కొన్ని చిన్న ముద్రణాయంత్రాలతో ప్రారంభించబడిన ఈ ముద్రణాలయాన్ని అప్పట్లో మహంతు ప్రెస్‌గా పిలిచేవారని తెలిపారు. 1954వ సంవత్సరంలో ఈ ప్రెస్ మద్రాస్ నుండి తిరుపతికి రావడం జరిగిందని అనేక పుష్కరాలలో, బ్రహ్మోత్సవాలలో స్వామివారి చిత్రాల ముద్రణతో పాటు వివిధ భాషలలో అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించి భక్తులందరికి విశిష్ఠసేవలందించడం జరిగిందని వాటిలో ప్రముఖమైనది మూడు భాషలలో ప్రచురించబడిన సప్తగిరి బులిటెన్ అని చైర్మన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర హోంశాఖామాత్యులు డాక్టర్ వి.ఎస్. ఆచార్య, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, జెఇఓ డాక్టర్ ఎన్. యువరాజ్ ఆర్థికసలహాదారు శ్రీ ఎల్.వి.భాస్కరరెడ్డి, ప్రెస్ మేనేజర్ శ్రీ సాంబశివరావు, ఎస్.ఇ. సుధాకర్‌రావు, ఇఇ నాగేశ్వరరావు ప్రెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంక్షిప్త సమాచారం :
కాలానుగుణంగా అవసరమైన ముద్రణలో జాప్యం నివారించేటందుకు అవసరమైన మోనోటైప్ అనే మెకానికల్ కంపోజింగ్ అనే ఆధునిక యంత్రాలను 1967లో ప్రారంభించి నూతన శకానికి నాంది పలికింది ప్రెస్. దీనితోపాటు తదుపరి కాలంలో ముద్రణాలయంలో కొన్ని నూతన ముద్రణాయంత్రాలు చోటుచేసుకున్నాయి. వాటిలో లెటర్‌ప్రెస్ సిలెండర్, బైండింగ్ యంత్రాలు, ఫోల్డింగ్, కటింగ్ యంత్రాలతో మరింత సాంకేతిక సిబ్బందితో ముద్రణ మరింత వేగవంతంతో పాటు నాణ్యమైన అనేక గ్రంథ ప్రచురణలను కూడ చేపట్టింది.
1980లో వచ్చిన సాంకేతిక నూతన విజ్ఞానాన్ని ఆహ్వానిస్తూ, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటసారిగా ఆత్యాధునిక కంప్యూటర్ యూనిట్ ”ఫోటోటైప్ సెట్టింగ్” ను ప్రవేశపెట్టిన ఘనత ఈ తి.తి.దే. ప్రెస్ సొంతం చేసుకుంది. దీనితోపాటు కలర్ ఆఫ్‌సెట్ ప్రింటింగ్ యంత్రాలు 3, నూతన బైండింగ్ మరియు ఒకేసారి మూడు వైపులా కటింగ్ చేసే కటింగ్ యంత్రాలను, ఆటోమేటిక్ ఫోల్డింగ్ యంత్రాలను కూడ ప్రవేశపెట్టింది.
తరువాత 1990 లో రెండు రంగులతో ఒకేసారి ప్రింటింగ్ చేసే ఆఫ్‌సెట్ యంత్రాలు, వెబ్ ఆఫ్‌సెట్ యంత్రాలు, కొన్ని ఆధునిక బైండింగ్ యంత్రాలను ప్రవేశపెట్టింది. తరువాత కాలానుగుణంగా ”ఫోటోటైప్ సెట్టింగ్ కంప్యూటర్ యూనిట్” స్థానంలో డి.టి.పి. కంప్యూటర్ యూనిట్‌ను ప్రవేశపెట్టి 5 భాషలలో ఆధునిక ముద్రణాయంత్రాలతో ముందుకు సాగింది. ప్రస్తుతం 3 సింగల్ కలర్ ఆఫ్‌సెట్ యంత్రాలతో పాటు 2 టవర్ వెబ్ ఆఫ్‌సెట్, ఒక రెండురంగుల డబుల్‌డెమ్మీ ఆఫ్‌సెట్ యంత్రాలను ప్రవేశపెట్టింది. 2003లో కంప్యూటర్ స్టేషనరీ ప్రింటింగ్ యంత్రాలతో ఆధునిక ముద్రణా వ్యవస్థను నెలకొల్పారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం భవనం చాలా పురాతనమైనందున, ఆధునిక ముద్రణాలయ వసతులతో 4 కోట్లు రూపాయల వ్యయంతో తి.తి.దే. నిర్మించిన 3 అంతస్తుల నూతన ఆవరణలోకి ప్రవేశిస్తుంది. ఈ నూతన ప్రింటిగ్ ప్రెస్‌ను తి.తి.దే. పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె. ఆదికేశవులు గురువారం (జూన్ 24) ఉదయం ప్రారంభించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.