EO CALLS EMPLOYEES FOR DEDICATED SERVICES TO PILGRIMS IN HIS I-DAY MESSAGE_ టిటిడి పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు

Tirumala, 15 Aug,2017: Remembering the great sacrifices of our national leaders who have given us the fruits of freedom and following their footsteps serving the multitude of visiting pilgrims with utmost devotion, is the best tribute which we can offer to them on this Independence Day, asserted TTD EO Sri AK Singhal.

During his Independence Day address in Parade Grounds behind TTD administrative building in Tirupati on Tuesday after hoisting the National Flag, the EO said, TTD is committed to offer best possible services to pilgrims. “The recently brought changes at Vendi Vakili in Tirumala has given good results and the pilgrims are having hassle free Darshan without any jostling. Similarly the help desks, milk distribution to infants in compartments, free telephone facility to pilgrims in compartments, Room Allotment system at CRO, Divya Darshan tokens in both footpath routes etc.have also been effectively implemented keeping in view the importance of the pilgrims”, he added.

The EO also elaborated on the multiple tasks taken up by TTD including Renovation of 100 ancient Lord Venkateswara Swamy temples located in AP, construction of new temples in 500 SC, ST colonies across at an expenditure of Rs.25crores, Subhapradham, Srinivasa Kalyanams, Managudi, using the non-conventional energy resources, improvement of TTD hospitals with state of art equipment, revival of central library of TTD as “Divine Digital Knowledge Centre”, etc.are a few to mention.

The EO further said that, all these socio-religious-educational-medical activities are possible with the dedication of the employees of TTD. I wish you all continue to work with the same spirit in future too”, he aspired.

EMPLOYEES AND EPIC STUDENTS FELICITATED

TTD Employees hailing from various departments who excelled in their services were felicitated with 5gram silver medals on this occasion.
The students who stood in first, second and third places at state and district levels in Sanatana Dharmic exams organised by TTD were also felicitated.

FLAG HOISTING AT TTD PRESS AND TRANSPORT

The head of TTD Printing Press Dr T Ravi and General Manager of TTD transport wing Sri Sesha Reddy have hoisted the National Flags in their office premises on this occasion


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి పరిపాలనా భవనంలో మువ్వన్నెల జెండా రెపరెపలు

ఆగస్టు 15, తిరుపతి, 2017: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర దిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 20 మంది అధికారులు, 137 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్వీ ఆయుర్వేద కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఆ తరువాత పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టిటిడి ఉద్యోగుల పిల్లలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను టిటిడి అధికారులు అందించారు. ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన వారికి రూ.2,116/-, పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.1,116/- నగదు బహుమతితోపాటు ప్రశంసాపత్రం అందజేశారు.

అదేవిధంగా, 34వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన ఆరుగురికి, చిత్తూరు జిల్లా, చెన్నై ర్యాంకర్లు 12 మందికి బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల ర్యాంకర్లకు ఆయా జిల్లా కేంద్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్‌ కేంద్రాల ద్వారా బహుమతులు ప్రదానం చేయనున్నారు.

క్షేత్రస్థాయిలో భజనల ద్వారా ధర్మప్రచారం చేస్తున్న హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలోని భజన మండళ్ల గురువులకు ప్రశంసాపత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, న్యాయాధికారి శ్రీ ఎం.వి.రమణ నాయుడు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి శ్రీ ఓ.బాలాజి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వేణుగోపాల్‌ ఇతర విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టిటిడి కార్యనిర్వహణాధికారి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో మంగళవారం భారత స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈవో మాటల్లోనే…. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల కైంకర్యాలను నిర్వహిస్తూ తరిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతాసిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థినీ విద్యార్థులకు, భక్తకోటికి, శ్రీవారిసేవకులకు 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఎందరో వీరుల ప్రాణత్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా ఉంటున్నాం. ఈ సందర్భంగా త్యాగమూర్తులందరికీ జోహార్లు తెలియజేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శ్రీనివాసుడు సకలశుభాలు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను.

– తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మూెత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తజనకోటికి సౌకర్యాలు కల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నాయి.

– శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉంటున్న భక్తుల నుంచి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను ప్రతిరోజూ హెల్ప్‌డెస్క్‌లో శ్రీవారి సేవకుల ద్వారా సేకరిస్తున్నాం. ఈ మేరకు సౌకర్యాలు పెంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– వైకుంఠం కంపార్ట్‌మెంట్‌లో వేచియుండే భక్తుల సౌలభ్యం మేరకు డిస్‌ప్లే స్క్రీన్‌లు, అదనపు టాయిలెట్లు, ఉచిత టెలిఫోన్‌ సౌకర్యాలను కల్పించాం. అదేవిధంగా దివ్యాంగులకు, వృద్ధుల సౌకర్యార్థం ప్రత్యేక టోకెన్‌ కౌంటర్లు, వారు వేచి ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం. దర్శనానికి వెళ్లే క్యూలైన్లలో తోపులాటలు జరుగకుండా చర్యలు తీసుకున్నాం.

– కాలినడక భక్తులకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో కలిపి ఒక రోజుకు 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం. భక్తులు వారికి కేటాయించిన టైమ్‌స్లాట్‌ ప్రకారం క్యూలైన్‌లోకి ప్రవేశించి రెండున్నర గంటలలోపే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.

– తిరుమలలో గదుల కేటాయింపులో మరింత పారదర్శకత పెంచేందుకు, ఎక్కువసేపు క్యూలో వేచి ఉండకుండా నివారించేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం.

– అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచి ఎక్కువ మంది భక్తులకు అందించేందుకు తిరుమలలో రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. ఇందుకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతిలోని టిటిడి సత్రాలలో కూడా అన్నప్రసాదాలు అందిస్తున్నాం.

– విద్య, వైద్యం, వేదం, అన్నప్రసాదం, గోసంరక్షణ, పురాతన ఆలయాల పరిరక్షణ తదితర సేవాకార్యక్రమాల కోసం 9 ట్రస్టులు, ఒక స్కీమ్‌ను టిటిడి నిర్వహిస్తోంది. వీటి ద్వారా వచ్చిన విరాళాలను కార్పస్‌గా వినియోగించి, వాటిపై వచ్చిన వడ్డీతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పురాతన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలను గుర్తించి, వాటికి కావాల్సిన మరమ్మతులు పూర్తి చేసి పూర్వవైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

– హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా మనగుడి, శుభప్రదం, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

– మారుమూల ప్రాంతాల్లోనూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా దాదాపు రూ.25 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోంది.

– అదేవిధంగా, విదేశాల్లో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లోని అర్చకులకు కూడా శిక్షణ ఇచ్చి తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే ఆగమశాస్త్రబద్ధంగా కైంకర్యాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– టిటిడి పుస్తక ప్రచురణల విభాగాన్ని శ్రీవేంకటేశ్వర కేంద్రీయ గ్రంథాలయానికి అనుసంధానం చేసి డివైన్‌ డిజిటల్‌ నాలెడ్జి సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నాం. తద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తులు టిటిడి పుస్తకాలను చదవడానికి వీలు కల్పిస్తున్నాం.

– విద్యుత్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా టిటిడి అడుగులు వేస్తోంది. కోసువారిపల్లెలోని సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు చేపట్టాం. తద్వారా సంవత్సరానికి 150 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాం.

– భక్తులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు టిటిడి ఆధ్వర్యంలో గల రోడ్లలో, ప్రముఖ కూడళ్లలో పచ్చదనం పెంచడంతో పాటు ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేసి శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నాం.

– కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తిరుమలకు సులువుగా చేరుకునేందుకు అలిపిరి-చెర్లోపల్లి రహదారిని నాలుగు లైన్లుగా మార్చడానికి చర్యలు చేపట్టాం.

– కొన్ని దశాబ్దాలుగా టిటిడి వైద్యరంగంలో సేవలు అందిస్తోంది. అందులోభాగంగా బర్డ్‌ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన ఆర్థోపెడిక్‌ వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించడం ద్వారా 2020వ సంవత్సరం వరకు ఉన్న ఆపరేషన్ల వెయిటింగ్‌ సమయాన్ని రెండేళ్లకు తగ్గించాం. తద్వారా ఎక్కువ మంది రోగులకు వైద్య సహాయం అందుతోంది.

– అదేవిధంగా తిరుపతికి వచ్చిన భక్తులు, రోగుల సౌకర్యార్థం తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో అదనపు గదులు, అదనంగా బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. నేత్ర వైద్యం కోసం అరవింద నేత్ర వైద్యశాల, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి జరుగుతోంది.

– టిటిడిలోని మొత్తం 17 విద్యాసంస్థల్లో దాదాపు 12 వేల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాం. వారికి మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నాం.

– తిరుమల శ్రీవారి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం జరిగే సేవలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేలా చర్యలు చేపట్టాం. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో తెలుగు, ఎస్వీబిసి-2లో తమిళం, కన్నడ భాషల్లో ప్రసారాలు అందిస్తున్నాం.

– టిటిడి ఉద్యోగులతో తరచూ సమావేశాలు నిర్వహించి వారు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

– ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్తజనావళికి సేవలందించాలని, తద్వారా మనం ఇతర ధార్మిక సంస్థలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, కలియుగ శ్రీవేంకటేశ్వరుడు యావత్‌ ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను….జైహింద్‌.

టిటిడి ప్రెస్‌, రవాణా విభాగంలో జెండా ఆవిష్కరణ :

టిటిడి ఆధ్వర్యంలోని ముద్రణాలయం, రవాణా విభాగంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. టిటిడి ముద్రణాలయంలో జరిగిన వేడుకల్లో ప్రెస్‌ మేనేజర్‌, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు. రవాణా విభాగంలో జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో ప్రెస్‌, రవాణా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.