KAPILESWARA BTUs OFF TO A CEREMONIOUS START _ ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 14 Feb. 20: The annual Brahmotsavams at Sri Kapileswara Swamy temple off to a religious start on Friday with the ceremonious Dhwajarohanam.

The Executive Officer Sri Anil Kumar Singhal said that as per Shaiva Agama tradition, the annual fete, which commenced on February 14, would last up to February 23.

After the Dwajarohanam at 8.04 am in Kumbha Lagnam where in Nandi Dhwaja was hoisted atop the temple mast amidst the chanting of vedic hymns at the temple premises, the EO said TTD had spent about Rs20.50 lakhs on civil engineering works and ₹6 lakhs towards electrical decorations and 4 tonnes of flowers for the annual event.

Pushkarani has been cleaned up and Anna Prasadam, water, buttermilk, milk etc.will be served to pilgrims both in the morning and evening. On Mahasivaratri day on February 21, annaprasadam will be served to thousands of devotees who throng to witness presiding deity as well as Nandi Vahana Seva.

The EO said about 250 srivari sevaks, 150 scouts have also been deployed apart from TTD Security to offer services to devotees.

JEO Sri P Basanth Kumar, DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and other office staff were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

 

ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఫిబ్రవరి 14, తిరుపతి, 2020 : తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.04 గంటలకు కుంభ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి కంకణభట్టర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ధ్వజస్తంభానికి  విశేష అభిషేకం :

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.

భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు విచ్చేసే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 21న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 22న కల్యాణోత్సవం, ఫిబ్ర‌వ‌రి 23న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నట్టు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రూ.20.50 ల‌క్ష‌ల‌తో ఆల‌యంలో చ‌లువ‌పందిళ్లు త‌దిత‌ర సివిల్ ఇంజినీరింగ్ ప‌నులు, రూ.6 ల‌క్ష‌ల‌తో  విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌ని ఈవో వెల్ల‌డించారు. రోజుకు 500 మంది భ‌క్తుల‌కు మ‌ధ్యాహ్నం 12.30 నుండి 3 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 6.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తామ‌ని, అదేవిధంగా, తాగునీరు, పాలు, మ‌జ్జిగ పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా నంది వాహ‌నం రోజున ఎక్కుమంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు. 100 మంది టిటిడి భ‌ద్రతా సిబ్బంది, 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 100 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో భ‌క్తుల‌కు సేవ‌లందిస్తామ‌ని తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహ‌నాల పార్కింగ్ ఏర్పాట్లు చేశామ‌న్నారు. 4 ట‌న్నుల పుష్పాలతో ఆక‌ట్టుకునేలా ప్ర‌త్యేక పుష్పాలంక‌ర‌ణ‌లు చేశామ‌ని, భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌థ‌మ చికిత్స కేంద్రం, ఆయుర్వేద వైద్య‌శిబిరం ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృ పకు పాత్రులు కావాలని కోరారు.

అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

హంస వాహనం :

రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు. ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఇఇ శ్రీ టి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, డెప్యూటీ ఇఇ శ్రీ సుబ్ర‌మ‌ణ్యంరెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.