KIN OF BRAIN DEAD SHOULD COME FORWARD TO DONATE ORGAN TO SAVE ANOTHER LIFE-TTD EO _ బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు రావాలి- డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

TIRUMALA, 03 MARCH 2023: The kin of Braindead should come forward to donate heart to save another life, said TTD EO Sri AV Dharma Reddy.

During the Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO before taking calls from the pilgrims, explained them on the various activities taken up by TTD in the last one month that included a second successful Heart Transplant Operation in Sri Padmavathi Childrens’ Heart Centre in Tirupati where in the heart of a Braindead two-year old is inserted to a one year old infant. 

The EO said, so far two successful heart transplants took place with the dedicated efforts of a team of doctors of SPCHC and so far 1150 heart-related operations were performed in the last 15 months in the hospital. He gave a call to the devotees to come forward to Donate Organs (of the Brain Dead) and give a new lease of life to the needy. 

Later the EO also said, the Face Recognition Technology(FRT) has come into force from March 1 onwards in the accommodation and sarva darshan areas to avoid misappropriation by the middlemen and enhance transparency in pilgrim services. 

He also said, the issuance of SRIVANI offline tickets resumed in Gokulam Rest House and to avoid misappropriation only the person with Adhaar card shall be issued the tickets. 

TTD has entered into an MoU with the renowned Educational Trust in the country, Smt Sulochana Devi Singhania School Trust to enhance the educational standards of its students in SV Primary and High school in Tirumala. 

The others included eleven shoe-keeping counters to commence in Tirumala in the second week of April, successful operations of Cleft Palate, Smile Train and Cochlear in BIRRD, more Ayurvedic products in market by TTD soon etc.

The EO also briefed on the upcoming events in Tirumala and other temples related to TTD including Salakatla Teppotsavams from March 3-7, Sri Sobhakrit Nama Ugadi Astanam on March 22, Sri Rama Navami Astanam on March 30, Tumburu Theertha Mukkoti and Sri Sita Rama Kalyanam at Vontimitta on April 5.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు రావాలి

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుమల, 03 మార్చి 2023: శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రిలో నెల రోజుల్లోనే రెండు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. గుండె దానం చేయాలనుకునే వారు ముందుగా టీటీడీ కి తెలియజేస్తే వైద్యబృందం సకాలంలో వచ్చి గుండె సేకరించి దాన్ని మరో బాలుడు లేదా బాలికకు అమర్చి వారి ప్రాణాలు కాపాడటం జరుగుతుందన్నారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి, ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమలలో. గదుల కేటాయింపు, డిపాజిట్ తిరిగి చెల్లింపు ప్రక్రియలో మార్చి 1 నుండి ప్రయోగాత్మకంగా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నాము. దీనివల్ల దళారీల బెడద దాదాపుగా తొలగింది. సర్వదర్శనం భక్తులకు వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్ లో కూడా ఈ పరిజ్ఞానం ఉపయోగిస్తాము. దీనివల్ల ఉచిత లడ్డూల పంపిణీలో అవకతవకలు జరక్కుండా నిరోధించవచ్చు.

తిరుమలలోని గోకులం కార్యాలయంలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించడం జరిగింది. భక్తులు నేరుగా తమ ఆధార్‌ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. దీనివల్ల దళారుల బెడద పూర్తిగా తొలగుతుంది.

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక, ఉన్నత పాఠశాల దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీమతి సులోచనాదేవి సింఘానియా స్కూల్‌ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకుంది.దీనివల్ల పాఠశాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుంది.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పాదరక్షలు భద్రపరుచుకునేందుకు వీలుగా ఏప్రిల్‌ రెండవ వారంలో 11 కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని ఆంధ్ర గీర్వాణ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న శ్రీనివాస రుక్‌ సంహిత చతుర్వేద హవనం ప్రారంభమైంది. మార్చి ఆరో తేదీ వరకు ఏడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది.

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. మార్చి 7వ తేదీ వరకు జరుగనున్నాయి.

మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాము.

మార్చి 18న తిరుమలలో శ్రీ అన్నమాచార్య వర్ధంతి ఘనంగా నిర్వహిస్తాము.

మార్చి 22న శ్రీ శోభకృత్‌ నామ ఉగాది సందర్బంగా శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం నిర్వహిస్తారు.

మార్చి 31 నుండి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు వై ఎస్ ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్‌ 5న శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించారు. ఆసుపత్రి ప్రారంభించిన 15 నెలల్లోనే 1150 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది.

క్యాన్సర్‌, కిడ్నీ, గుండె తదితర వ్యాధుల కారణంగా భరించలేని నొప్పితో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కల్పించడం కోసం ఫిబ్రవరి 4వ తేదీ నుండి స్విమ్స్‌లో పెయిన్‌ పాలేటివ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఇక్కడ నిర్వహిస్తున్న ఓపిడి, ఐపిడిలకు రోగుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

స్విమ్స్‌లో వైద్యసేవలు పొందుతున్న క్యాన్సర్‌ రోగులకు వైద్య సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు ఎప్పటికప్పుడు చికిత్సకు సంబంధించిన విషయాలు తెలియజేయడం కోసం క్యాన్సర్‌ కేర్‌ ట్రాకర్‌ యాప్‌ను ప్రారంభించాం. దేశంలో ఈ తరహా యాప్‌ను మొట్టమొదటగా స్విమ్స్‌లోనే ప్రారంభించడం జరిగింది.

పుట్టుకతోనే చెవుడు మూగతో బాధపడేవారికి బర్డ్‌లో స్మైల్‌ ట్రైన్‌ సంస్థ సహకారంతో ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేస్తున్నాం. రూ.20 లక్షల వ్యయమయ్యే ఈ ఆపరేషన్‌ ఉచితంగా నిర్వహించి చెవుడు మూగ సమస్యల నుంచి వారికి విముక్తి కల్పించి కొత్త జీవితాన్ని అందిస్తున్నాం.

బర్డ్‌ ఆసుపత్రిలో ఏ వయసువారికైనా ఉచితంగా గ్రహణమొర్రి ఆపరేషన్లు నిర్వహించి వారు స్పష్టంగా మాట్లాడగలిగేలా తయారు చేస్తున్నాం. 5 నెలల కాలంలో 50 ఆపరేషన్లు నిర్వహించాం. రూ.2 లక్షలు ఖర్చు అయ్యే ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేయడంతోపాటు వారికి రవాణా ఖర్చులు, పోషకాహారం తీసుకునేందుకు సహాయం చేస్తున్నాం. అలాగే బర్డ్‌లో అధునాతన సిటి స్కాన్‌ ఏర్పాటుచేసి బయటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు కూడా తక్కువ ధరకు సిటి స్కాన్‌ చేస్తున్నాం.

టీటీడీ ఆయుర్వేద ఫార్మశీని మరింత బలోపేతం చేసి ఔషధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాం. 314 రకాల ఫార్ములాలకు ఆయుష్‌ శాఖ నుండి అనుమతి లభించింది. వీటిలో 60 రకాల మందులు మొదటి దశలో ఉత్పత్తి చేసి రోగులకు అందుబాటులో ఉంచుతాం.

అన్నప్రసాదం దుష్ప్రచారంపై. ఖండన

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పై రాధామోహన్ దాస్ అనే భక్తుడు దురుద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రచారాన్ని ఈవో ఖండించారు. ఇందుకు సంబంధించి పలువురు భక్తులు అన్నప్రసాదం చాలా బాగా ఉందని వెల్లడించిన వీడియో ను ప్రదర్శించారు.అన్నప్రసాద కేంద్రంలో ఉపయోగించే బియ్యంఇతర సరుకులు కూరగాయలు వివిధ దశల్లో క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే వంటకు ఉపయోగిస్తున్నామని ఈవో వివరించారు. టీటీడీ మీద రాధామోహన్ దాస్ చేసిన దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 18.42 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు ` రూ.114.29 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 92.96 లక్షలు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 34.06 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.21 లక్షలు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ బీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.