KOIL ALWAR TIRUMANJANAM HELD AT KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, October 7, 2026: Koil Alwar Tirumanjanam was performed as per tradition at Sri Kapileswara Swamy Temple in Tirupati on Wednesday ahead of the Sri Kamakshi Ammavari Navaratri Utsavams, to be held from October 11 to 20.

The temple premises, including the sanctum sanctorum, Dhwajasthambham, sub-shrines and surroundings, were thoroughly cleansed during the ritual.

The Navaratri Utsavams will feature daily Snapana Tirumanjanam and special deity decorations. On October 20, Parveta Utsavam will be held at Sri Abhaya Hasta Anjaneya Swamy Temple at 6 pm.

TTD will also organise devotional music, Devi Bhagavatham discourses and Lalitha Sahasranama Parayanam during the celebrations.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

–   అక్టోబ‌రు 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2026 అక్టోబ‌రు 07: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో బుధ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. న‌వ‌రాత్రి ఉత్స‌వాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబ‌రు 11 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబరు 11న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురార్ప‌ణ‌, న‌వ క‌ల‌శ స్థాప‌న‌, వాస్తుపూజ నిర్వ‌హిస్తారు.

ప్రతి రోజూ ఉదయం 9 – 10 గం.ల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేవిధంగా, ఊంజల్ సేవలో భాగంగా అక్టోబరు 11న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 12న మావడి సేవ అలంకారం, అక్టోబరు 13న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబ‌రు 14న శ్రీ గాయ‌త్రి అలంకారం, అక్టోబరు 15న శ్రీ తపః కామాక్షి అలంకారం, అక్టోబరు 16న శ్రీ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారు, అక్టోబ‌రు 17న‌ శ్రీ‌అన్నపూర్ణాదేవి, అక్టోబరు 18న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 19న శ్రీ‌ సరస్వతి దేవి, అక్టోబరు 20న శ్రీ శివ‌పార్వ‌తుల‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

అక్టోబరు 20న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంట‌ల‌కు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.