KOIL ALWAR TIRUMANJANAM PERFORMED IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 09 జూలై 2013 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదిన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తి.తి.దే అత్యంత వైభవంగా నిర్వహించింది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మంగళవారంనాడు ఉ. 6 గం||ల నుండి ఉ. 10.00 గం||ల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహించారు.
ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి వేసారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమాన్ని గోడలకు పూసారు. ఈ యావత్ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి. గోపాల్, పాలకమండలి సభ్యులు శ్రీ రేపాల శ్రీనివాస్, సి.వి.ఎస్.ఓ. శ్రీ జి.వి.జి.అశోక్‌కుమార్, ఎ.సి.వి.ఎస్.ఓ. శ్రీ శివకుమార్‌రెడ్డి, డిప్యూటి ఇఓ శ్రీ చిన్నంగారి రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.