శ్రీవారి ఊంజల్‌సేవలో ఆకట్టుకున్న శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి గాత్రం


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి ఊంజల్‌సేవలో ఆకట్టుకున్న శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి గాత్రం

సెప్టెంబరు 15,తిరుమల 2018 ;శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్దగల సహస్రదీపాలంకార సేవ మండపంలో శనివారం సాయంత్రం ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఇందులో ప్రముఖ సంగీత కళాకారిణి శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి గాత్రం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు వేదం, నాదం, వాద్యనీరాజనం సమర్పించారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో శ్రీమలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు ఊంజల్‌సేవతో సేద తీరుతారు.

ఊంజల్‌సేవలో ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత కళాకారిణి శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి పలు అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘గోవింద గోవిందయని కొలువరే…, చల్లరే హరిపై జాజర జాజ…., అలరచంచలమైన ఆత్మలందుండనీ అలవాటుజేసెనీ ఉయ్యాల…’ తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.

కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు శ్రీకె.మునికుమార్‌, శ్రీ బి.శ్రీనివాసులు బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కామాక్షి బృందం విష్ణుసహస్రనామం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరంగానికి చెందిన శ్రీటిఎకె.శ్రీనివాసచారియర్‌ ధార్మికోపన్యాసం చేశారు.

మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ ఎవికె.రాజసింహం నామసంకీర్తన, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు విజయనగరానికి చెందిన శ్రీమతి కాళ్ల నిర్మల భాగవతారిణి హరికథ పారాయణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో శనివారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన పద్మశ్రీ త్యాగరాజు బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.