Laying of the foundation stone for Sri Anjaneya Swamy Temple in Cherlopalli _ ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి శంఖుస్థాపన
ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి శంఖుస్థాపన
తిరుపతి ఫిబ్రవరి-19,2009: రాష్ట్రంలో ఆలయాల అభిృద్ధికి అర్చక స్వాములకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్రప్రభుత్వం అందజేయడం వలన ఎన్నో ఆలయాలు నిత్యదూపదీపనైవేద్యాలకు నోచుకున్నాయని రాష్ట్రవైద్య ఆరోగ్యభీమాశాఖామాత్యులు శ్రీమతి గల్లా అరుణకుమారి అన్నారు. కగురువారం ఉదయం చెర్లోపల్లి వద్ద గల ఆంజనేయస్వామి ఆలయపునర్ నిర్మాణానికి ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు 600 సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ ఆంజనేయస్వామి వారి ఆలయం ఎంతో ప్రాశస్థ్యం కల్గినదని చెప్పారు. ప్రపంచలోని అనేక దేశాలలో ప్రత్యేక మానసిక వైద్యశాలలు, వైద్యులు ఉన్నారని అయితే మనదేశంలో ఆ అవసరం లేకుండా, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు తనకిష్టమైన ఆలయాలకు వెళ్ళి దైవాన్ని స్మరించుకోవడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడుతున్నారని, అదే భారతదేశంలో విశ్వాసాలకు వున్న విలువ, గొప్పదనం అని ఆమె పేర్కొన్నారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి మాట్లాడుతూ నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, భగవంతుడు భక్తులకు ఆయుస్సు, బుద్ది, శక్తిని, ఆసక్తిని, ప్రసాదిస్తాడని, దైవం, వైదికం విషయంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడని, ఆంజనేయస్వామి వారి స్త్రోత్రంలోని కొన్ని శ్లోకాలను పఠించి ప్రజలను భక్తి పారవశ్యం చేశారు.
ఈ ఆలయ నిర్మాణం రూ.21 లక్షలతో నిర్మించనున్నారు. ఇందులో తితిదే రూ.17.5 లక్షలు ఆంజనేయస్వామివారి ఆలయట్రస్టు రూ.4 లక్షలు ఇస్తున్నది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ శ్రీరెడ్డెప్ప నాయుడు, తితిదే ఛీఫ్ ఇంజనీర్ శ్రీవి.ఎస్.బి.కోటేశ్వరరావు, ఆలయ ఇ.ఓ శ్రీఆదికేశవుల పిళ్ళై, చెర్లోపల్లి సర్పంచ్ శ్రీ సుబ్రమణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.