LORD SWAYS ON GAJA VAHANA _ గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు

Srinivasa Mangapuram, 19 Feb. 20: The majesty, charm and glory of the processional deity of Sri Kalyana Venkateswara Swamy enhanced on the mighty Gaja Vahanam on the sixth day evening on Wednesday.

As a part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapauram, the Lord took celestial ride on the Gaja Vahanam. 

Gaja Vahanam is a symbol of pride and majesty. The emperors and kings used to exemplify their riches based on the number of elephants they are having in the army camp. 

Lord swayed all along the mada streets on the hefty Gaja Vahanam to bless his devotees.

DyEO Sri Yelleppa and other temple staff, large number of devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు
 
తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 19: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధ‌వారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల  నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
       
ఇంటిముందు ఏనుగులగుంపులు బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉండడం –  ఐశ్వర్యానికి పరాకాష్ఠ.  రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. శ్రీవేంకటేశ్వరస్వామి  గజవాహనారూఢుడై తిరువీథులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం.  కనుక పట్టపుటేనుగుపై ఊరేగడం చక్రవర్తి లక్షణం. శ్రీవారు విశ్వ చక్రవర్తి కనుక – ఆవిషయాన్ని గుర్తుచేస్తూ – ఏనుగుపై ఊరేగింపుగా వస్తాడు.
         
‘గజం’ అనేపదం  రాకపోకలుగల ప్రకృతికి సంకేతం. అంటే విశ్వానికి సంకేతం. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. గజరాజులు రోజూ శ్రీవారిసేవలో పాల్గొంటూనే ఉంటాయి. కానీ తమపై స్వామి అధిరోహించేదెప్పుడా అని ఎదురుచూస్తుంటాయి. ఆ గొప్పఅవకాశం బ్రహ్మోత్సవాలలో వాటికి లభిస్తుంది. తమజాతిలో ఏ ఒక్క ఏనుగుపై స్వామి అధిష్ఠించినా – ఆజాతికంతా సంతోషమే. పైగా స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగానూ, ఏనుగు స్వామికివాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.
       
ప్రత్యక్షంగా ఏనుగులు ముందుంటాయి. వాహనరూపమైన ఏనుగు పల్లకీలో ఉంటుంది. ఏవిధంగానైనా గజవాహనసేవ ప్రశస్తమైందే, శరణాగతికి గజేంద్రునిసేవ ఉదాహరణం.
       
భగవంతుడు ఆర్తత్రాణపరాయణుడు. భక్తితో ప్రార్థిస్తే తప్పకవచ్చి రక్షిస్తాడనే సంగతిని గజవాహనోత్సవం సూచిస్తూంది. అన్నీవదలి తననే శరణుకోరిన – గజేంద్రుణ్ణి రక్షించినట్లే మిమ్మల్నీ రక్షిస్తానని స్వామి అభయప్రదానం – గజవాహనసేవలో వ్యక్తమవుతుంది.
     

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా బుధ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.
           
శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో శ్రీ ఎం.హ‌రిబాబు బృందం ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ హ‌రిబాబు బృందం మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీం.మ‌ల్లిక‌ బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు భ‌ద్రాచ‌లంకు చెందిన శ్రీ‌రామ‌య‌ణ శ‌ర్మ‌ ధార్మికోప‌న్యాసం చేశారు.
       
మ‌ధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు తిరుప‌తికి  చెందిన విజ‌య‌కుమారి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం,  సాయంత్రం 4.00 నుండి  5.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ బి.ర‌ఘునాధ్ బృందంచే అన్న‌మ‌య్య విన్న‌పాలు,  సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు క‌ర్నూలుకు చెందిన హ‌రి ప్రియ‌ బృందం అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌మ్మ‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, ప్రధాన అర్చ‌కులు శ్రీబాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.