MAHA SHANTI ABHISHEKAM IN SRI GT_ శ్రీ గోవిందరాస్వామివారి ఆలయంలో ఘనంగా మహాశాంతి అభిషేకం

Tirumala, 11 April 2018: Maha Shanti Abhishekam was performed in Sri Govinda Raja Swamy temple in Tirupati on Wednesday by 2pm.

The day commenced with Suprabhatam, Tomala, Archana followed by homams in Yagashala. Later Bimba Vaastu and Maha Shanti abhishekams have been performed.

On April 12, there will be Maha Samprokshanam between 4:30am and 6:30am in Meenalagnam.

While in the evening there will be procession of Pedda Sesha Vahanam between 5:30pm and 7pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీ గోవిందరాస్వామివారి ఆలయంలో ఘనంగా మహాశాంతి అభిషేకం

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు మహాశాంతి అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్‌ 7వ తేదీ నుండి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, అర్చన నిర్వహించారు. ఉదయం 7.30 నుండి 11.30 గంటల వరకు యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 5.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, ద్వారపాలకులు, గరుడాళ్వారు, ధ్వజస్తంభం, ఎదురు ఆంజనేయస్వామివారు, భాష్యకార్లు, ఇతర ఆళ్వారులకు బింబవాస్తు, మహాశాంతి అభిషేకాలు నిర్వహించారు. కాగా సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు వైదిక కార్యక్రమాలు, ఉత్సవర్లకు శయనాధివాసం అనగా పవలింపుసేవ నిర్వహించనున్నారు.

ఏప్రిల్‌ 12న ఆలయంలో మహాసంప్రోక్షణ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 12వ తేదీ గురువారం ఉదయం 4.30 గంటలకు మహాసంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా జరుగనుంది. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా తెల్లవారుజామున 12.30 గంటలకు యాగశాలలో స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 4.00 నుండి 4.30 గంటల మధ్య యాగశాల నుండి కుంభాలు, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా ఆలయాలలో యధాస్థానానికి వేంచేపు చేస్తారు.

అనంతరం ఉదయం 4.30 నుండి 6.30 గంటల వరకు మీనలగ్నంలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉదయం 8.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు

కాగా సాయంత్రం 5.30 నుండి 7.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు పెద్ద శేషవాహనంపై, భాష్యకార్లు, ఆళ్వార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.