శ్రీకోదండరామాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ ప్రారంభం

తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో జూన్‌ 16వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్త హోమం, పంచగవ్యప్రాశన, రక్షాబంధనం, యాగశాల వాస్తుహోమం నిర్వహించారు. సాయంత్రం పుణ్యాహం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, కళాప్రకర్షనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, దివ్య ప్రబంధ సేవాకాలం ప్రారంభించారు.

జూన్‌ 14న దేవతామూర్తులకు అష్టబంధనం, జూన్‌ 15న మహాశాంతి పూర్ణాహుతి నిర్వహిస్తారు. జూన్‌ 16న ఉదయం 6.00 నుంచి 7.30 గంటల వరకు మిధున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి భక్తులను శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవర్ల దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.00 నుంచి 7.00 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం జరుగనుంది. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఈ కల్యాణం ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. అదేరోజు రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి మునిలక్ష్మి, టిటిడి వైఖానస ఆగమసలహాదారులు శ్రీ సుందరవరద భట్టాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ ఉమా మహేశ్వర్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.