Mahatma Jotiba Govindrao Phule Jayanthi Celebrations _ అణగారిన వర్గాల అభ్యుదయజ్యోతి జ్యోతిబా పూలే : తితిదే ఈవో
అణగారిన వర్గాల అభ్యుదయజ్యోతి జ్యోతిబా పూలే : తితిదే ఈవో
తిరుపతి, ఏప్రిల్ 11, 2013: అణగారిన వర్గాల అభ్యుదయజ్యోతి జ్యోతిబా పూలే అని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. మహాత్మ జ్యోతిబా పూలే 186వ జయంతిని గురువారం తితిదే పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ వర్ణ వ్యవస్థతో కునారిల్లిన సమాజానికి సంస్కారం నేర్పిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల సమున్నతి కోసం విద్యే సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని వివరించారు. అంబేద్కర్ అంతటివారే జ్యోతిబా పూలేని గురువుగా భావించారని తెలిపారు. భారతీయ ధర్మం సమానత్వాన్ని ప్రబోధిస్తుందని, తితిదే ఉద్యోగులు కూడా ఇదే సమానత్వాన్ని పాటించాలని ఆయన కోరారు.
తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు జ్యోతిబాపూలే విశేష కృషి చేశారని తెలిపారు. మహిళాభివృద్ధికి, స్త్రీవిద్యా వ్యాప్తికి శ్రీకారం చుట్టిన, వితంతు పునర్వివాహానికి నాంది పలికిన తొలి వ్యక్తి జ్యోతి బాపూలే అన్నారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.పృథ్విరాజ్, తితిదే సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఉద్యోగులు శ్రీమతి ఇందిర తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, డెప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్‌రెడ్డి, శ్రీమతి పార్వతి, ఏఈఓ శ్రీ లక్ష్మీ నారాయణ యాదవ్, ఎస్‌ఇ-1 శ్రీ సుధాకరరావు, ఎస్.సి లైజన్ ఆఫీసర్ శ్రీ బి.మనోహరం, ఎస్.టి లైజన్ ఆఫీసర్ శ్రీ డి.వేణుగోపాల్, నిఘా మరియు భద్రతాధికారి శ్రీ హనుమంతు ఇతర అధికార ప్రముఖులు, తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.