“MANAGUDI” AIMED AT THE PROMOTION OF HINDU DHARMA-TTD CHAIRMAN _ భారతీయ హైందవ ధర్మ పరిరక్షణకే ”మనగుడి” : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు
భారతీయ హైందవ ధర్మ పరిరక్షణకే ”మనగుడి” : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు
తిరుపతి, జూలై 23, 2013: భారతీయ హైందవ సనాతన ధర్మం పరిరక్షణకే ఆగస్టు 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, అందరూ కలసికట్టుగా పనిచేసి జయప్రదం చేయాలని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు పిలుపునిచ్చారు. తితిదే, రాష్ట్ర దేవాదాయ శాఖ సంయుక్తంగా చేపట్టనున్న మూడో విడత మనగుడి కార్యక్రమంపై తిరుపతిలోని శ్వేత భవనంలో మంగళవారం తితిదే అధికారులకు, 17 జిల్లాల నుండి విచ్చేసిన ధర్మప్రచార మండలి సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కనుమూరు బాపిరాజు ప్రసంగిస్తూ దేవాలయం మన సంస్కృతికి మూలకేంద్రమని, అలాంటి గుడికి చేసే పండుగ మనగుడి కార్యక్రమమని అభివర్ణించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ బృహత్కార్యంలో పాలుపంచుకుంటున్న ధర్మప్రచార మండలి సభ్యులను ఆయన అభినందించారు. సుమారు 20 వేల ఆలయాల్లో నిర్వహించనున్న ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈసారి 2 కోట్ల కంకణాలను భక్తులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ మాట్లాడుతూ అధికారులు, ధర్మప్రచార మండలి సభ్యులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి మనగుడి లక్ష్యాన్ని సాధించాలన్నారు. హరిజనవాడలు, గిరిజనవాడలు, మత్స్యకార కాలనీల్లోని ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ కార్యక్రమంలో చేర్చాలన్నారు. గ్రామస్తులు సొంత కార్యక్రమంగా భావించి జరుపుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో తితిదే పాలకమండలి సభ్యుల సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. దాతలెవరైనా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తే వాటిని స్వీకరించి సక్రమంగా రికార్డుల్లో నమోదు చేసి పారదర్శకత పాటించాలని కోరారు. ఆలయాలు లేని గ్రామాలను ధర్మప్రచార మండళ్లు గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ వినోద్ కె.అగర్వాల్ ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ మనగుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఇది ఏ ఒక్క సంస్థకు, విభాగానికి సంబంధించినది కాదని, హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు.
అనంతరం తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన ”మనగుడి మానవతా వికాస కేంద్రం” పుస్తకాన్ని తితిదే ఈవో ఆవిష్కరించారు.
అంతకుముందు తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 8న ఆలయ శోభ, ఆగస్టు 11న జిల్లా కేంద్రాల్లోని ఆలయాల్లో మనగుడి విశిష్టతపై ధార్మిక ఉపన్యాసాలు, ఆగస్టు 12న జిల్లాల్లోని 108 ఆలయాల్లో కుంకుమపూజ, ఆగస్టు 14న దేవాదాయ శాఖ 6ఎ, 6బి పరిధిలోని ఆలయాల్లో గోపూజ, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 17న ప్రతి జిల్లాలోని ఏడు హరిజనవాడలు/గిరిజనవాడల్లో సత్యనారాయణవ్రతం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో ఒక్కో కార్యక్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్, అన్ని విభాగాల అధిపతులు, ఆయా జిల్లాల ధర్మప్రచార మండలి అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.