“MANAGUDI” IS PRISTINE EMBLEM OF HINDU SANATANA DHARMA-TTD EO _ హైంధవ ధర్మప్రచార చిహ్నంగా ”మనగుడి” తి.తి.దే ఇ.ఓ, ”మనగుడి” కంకణాల ఊరేగింపు.
హైంధవ ధర్మప్రచార చిహ్నంగా ”మనగుడి” తి.తి.దే ఇ.ఓ, ”మనగుడి” కంకణాల ఊరేగింపు.
తిరుమల, 08 ఆగష్టు 2013 : హైంధవ ధర్మ ప్రచార చిహ్నంగా శోభిల్లుతున్న ”మనగుడి” కార్యక్రమాన్ని ప్రజలందరూ సామూహిక ఉత్సవంగా ఘనంగా నిర్వహించాలని తి.తి.దే ఇ.ఓ శ్రీ యం.జి.గోపాల్ పిలుపునిచ్చారు.
ఈ నెల 21వ తారీఖున శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో తి.తి.దే మరియు రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 3వ విడత ”మనగుడి” కార్యక్రమానికి భక్తులకు పంపిణీ చేసే కంకణాలు ఊరేగింపు కార్యక్రమం తిరుమలలో గురువారంనాడు ఘనంగా జరిగింది.
శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం చెంత నుండి తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ యం.జి గోపాల్, బోర్డుసభ్యులు శ్రీ శ్రీనాధరెడ్డి మరియు సంయుక్తకార్యనిర్వహణాధికారి తిరుపతి శ్రీ పి.వెంకటరామిరెడ్డి తలపై కంకణ పళ్ళాలను ధరించి శ్రీవారి ఆలయంలోని స్వామివారి పాదాలచెంత ఉంచి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఆ కంకణాలను, ఇతర పూజా సామగ్రితోపాటు సిద్ధంచేసి వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలకు పంపడానికి ఆస్థానమండపానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇ.ఓ మీడియాతో మాట్లాడుతూ పూర్ణ సంఖ్య అయిన ఆగష్టు 8వ తారీఖునాడు మనగుడి కార్యక్రమం కంకణ ఊరేగింపుతో ప్రారంభించడం శుభదాయకమన్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 20వేల ఆలయాలకు ఈ పూజా సామాగ్రిని పంపడం జరుగుతుందన్నారు. ఈ కంకణ సామగ్రిని వివిధ ఆలయాలకు సమాయత్తం చేసి పంపడంలో శ్రీవారిసేవకులు విశేషసేవలందిస్తున్నారన్నారు. హైంధవ ధర్మ ప్రచార చిహ్నంగా మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాద్, డిప్యూటి ఇ.ఓ శ్రీ ఉమాపతి రెడ్డి, ఆలయ పేష్కార్ శ్రీ సెల్వం తదితరులు పాల్గొన్నారు.
కాగా భవిష్యత్తు తరాలవారికి మన దేవాలయాల వైశిష్ట్యాన్ని, దేవాలయాల ప్రాశస్థ్యాన్ని తెలియజేయడానికి మనగుడి కార్యక్రమాన్ని తి.తి.దే మరియు రాష్ట్రదేవాదాయశాఖ గత రెండేళ్లుగా నర్వహిస్తూ వస్తున్నది. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన కూడా లభిస్తున్నది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.