MANAGUDI OBSERVED WITH RELIGIOUS GAIETY ACROSS THE DISTRICT _ తిరుపతిలో వాడవాడలా వైభవంగా ”మనగుడి” సంబరాలు
తిరుపతిలో వాడవాడలా వైభవంగా ”మనగుడి” సంబరాలు
తిరుపతి, 2012 ఆగస్టు 2: హిందూ సనాతన ధర్మ పరిరక్షణ, ప్రజల్లో ధార్మిక చైతన్యం నింపేందుకు తితిదే, దేవాదాయ శాఖ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మనగుడి ఉత్సవం తిరుపతిలోని పలు ఆలయాల్లో గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ పరిసరాల్లో పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంక రణలు చేపట్టారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు మహద్వారం చెంత రక్షాకంకణాలు పంపిణీ చేశారు.
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో..
భవిష్యత్తు తరాలకు హిందూ దేవాలయాల వైశిష్ట్యాన్ని తెలియజేసేందుకు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖతో కలిసి మనగుడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన మనగుడి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ విద్యాలయం కేవలం చదువు నేర్చుకునేందుకు మాత్రమే ఉద్దేశించింది కాదని, పేరులోనే ఆలయం కలిసి ఉన్న ఒక దివ్యసంస్థానమని అన్నారు. విద్యార్థి థ నుండే విద్యతోపాటు దైవచింతనను అలవాటు చేసుకోవాలని సూచించారు. పవిత్ర శ్రావణపౌర్ణమి, సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నూతన ఒరవడికి నాంది పలికినట్టయిందన్నారు. ఈ కార్యక్రమం హిందూ ధర్మ పరిరక్షణకు వారధిగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో విద్యార్థినులు క్రమం తప్పకుండా కళాశాలలోని పద్మావతి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇకపై ఇక్కడి ఆలయంలో నిత్య కైంకర్యాలు చేసేందుకు తితిదే సన్నద్ధమైందని జెఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాథ్, 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో..
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగిన మనగుడి ఉత్సవాన్ని రాష్ట్ర గనుల శాఖ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ప్రసంగిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్న నేటి యువతలో ధార్మిక చైతన్యాన్ని నింపేందుకు మనగుడి కార్యక్రమం చక్కగా ఉపయోగపడు తుందన్నారు. తితిదే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ గోపాలకృష్ణ, ఏఈఓ వేణుగోపాల్, శ్రీనివాసం ఏఈఓ శ్రీ చిన్నంగారి రమణ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో..
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో జరిగిన మనగుడి కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంప్రదాయానికి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగా తితిదే, దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ముదావహమన్నారు. సమాజంలో కునారిల్లుతున్న మానవీయ విలువలు, మృగ్యమవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భక్తి మార్గం ద్వారా ప్రేరిపించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 650కి పైగా ఆలయాల్లో, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 85 ఆలయాల్లో ఒక పండుగలాగా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓలు శ్రీమతి పార్వతి, శ్రీ చిన్నస్వామి ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎస్వీ ప్రాచ్య కళాశాలలో..
ప్రాచ్య కళాశాల, పాఠశాల విద్యార్థులు హిందూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలని తితిదే సేవల విభాగం ప్రత్యేశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి సూర్యకుమారి పిలుపునిచ్చారు. ఎస్వీ ప్రాచ్య కళాశాలలో జరిగిన మనగుడి ఉత్సవంలో ఆమె మాట్లాడుతూ తితిదే ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ ఉత్సవం జరుగుతోందన్నారు. ఇకపై కళాశాల విద్యార్థుల కోసం తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వారానికి రెండు తరగతులు మానవీయ విలువలపై నిర్వహిస్తామన్నారు.
తితిదే ఎడిటర్ ఇన్ చీఫ్ ఆచార్య రవ్వా శ్రీహరి ప్రసంగిస్తూ నీతివంతమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగపడేలా మనగుడి ఉత్సవం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. పవిత్రమైన విద్యాలయం కూడా గుడి లాంటిదేనని, ఇక్కడ మనగుడి జరుపుకోవడం ఆనందకరమని ఆయన అన్నారు.
తితిదే చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, హిందూ ధర్మప్రచార పరిషత్ ఎపిక్ స్టడీస్ కో-ఆర్డినేటర్ శ్రీ చెంచుసుబ్బయ్య, ప్రాచ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శర్మ పాల్గొన్నారు.
ఎస్వీ గోసంరక్షణశాలలో..
తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో మనగుడి ఉత్సవం ఘనంగా జరిగింది. గోసంరక్షణశాల సంచాలకులు శ్రీ హరినాథరెడ్డి ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సేవల విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి సూర్యకుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ దేవతామొక్కలైన ఉసిరి, జమ్మి, మారేడు, రావి మొక్కలు నాటారు. అనంతరం కపిలగోవుకు పూజ నిర్వహించి కంకణాలు ధరించారు. అలాగే వినాయకనగర్ క్వార్టర్స్‌లోని ముత్తుమారియమ్మ ఆలయంలో మనగుడి ఉత్సవం వైభవంగా జరిగింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.