National Seminar Annamaiah _ ఆన్నమాచార్య జాతీయ సదస్సు-సంకీర్తనా గోష్ఠి
ఆన్నమాచార్య జాతీయ సదస్సు-సంకీర్తనా గోష్ఠి
తిరుపతి, జనవరి-27,2009: తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఆన్నమాచార్య జాతీయ సదస్సు-సంకీర్తనా గోష్ఠి కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్హాలు నందు ప్రారంభమైనది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి మాట్లాడుతూ విద్యార్థులలో అన్నమయ్యపై అనురక్తిని, శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తిని పెంపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని, ఇక్కడ విద్యార్థులు అన్నమయ్యపై అగ్రగామిగా పరిశోధనలు చేసి, అన్నమయ్యను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. పద్యకవిత్వం విస్తృతమైన ప్రచారంలో వున్న రోజుల్లో తన సంకీర్తనల ద్వారా జన సామాన్యమును భక్తి మార్గములోనికి తీసుకెళ్ళిన కారణజన్ముడు అన్నమయ్య అని తెలిపారు. అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర స్వామికి వున్న అనుబంధం ఎంతో, తితిదేకి, ఎస్.వి.యూనివర్శిటీకి కూడా అంత అనుబంధం ఉందని తెలిపారు.
ఈ ప్రారంభ సదస్సుకు అద్యక్షత వహించిన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రభాకరరావు మాట్లాడుతూ యూనివర్శిటీ తెలుగు విభాగం నందు శ్రీ తాళ్ళపాక అన్నమయ్యపై దాదాపు పాతిక మంది విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించారని, అన్నమయ్య సంకీర్తనలు మధురాతి మధురమైనవని, ఆకీర్తనలు వినడం ద్వారా మనస్సు ఎంతో స్వాంతన పొందుతుందని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలు భక్తి ప్రభోదాత్మకమైనవని, శృంగారం మేళవించినవని, సంగీతానికి అనుగుణమైనవని అంతేగాకుండా అవి ప్రజా బాహుళ్యానికి చేరువలో వుండేవని ఆయన తెలిపారు.
ఈ సదస్సునందు ద్రవిడ యూనివర్శిటీ విశ్రాంత ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరి కీలకోపన్యాసం చేయగా, ఆచార్య కె. సర్వోత్తమ రావు, యూనివర్శిటీ తెలుగు విభాగ అధిపతి ఆచార్య జి. దామోదరంనాయుడు, సదస్సు సంచాలకులు శ్రీ చంథ్రేఖర్రెడ్డి, మునిరత్నమ్మలు ప్రసంగించారు. పిదప రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పలువురు సాహితీవేత్తలు పరిశోధనా పత్రాలను సమర్పించి ప్రసంగించారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 3వ తేది నుండి 9వ తేది వరకు 7 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఈసందర్భంగా ఫిబ్రవరి 3వ తేదిన శ్రీకోదండరామస్వామివారు, ఫిబ్రవరి 4వ తేదిన శ్రీపార్థసారధి స్వామివారు, ఫిబ్రవరి 5వ తేదిన శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి వారు, ఫిబ్రవరి 6వ తేదిన శ్రీకృష్ణస్వామి, శ్రీ అండాళ్ అమ్మవారు, ఫిబ్రవరి 7,8,9వ తేదిలలో శ్రీగోవిందరాజస్వామివార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు కనువిందైన దర్శనమిస్తారు.
ఈ సందర్భంగా ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.