జనవరి 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర నాట్యకళా పరిషత్ 64వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు : హెచ్‌డిపిపి కార్యదర్శి డా|| రమణప్రసాద్
జనవరి 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర నాట్యకళా పరిషత్ 64వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు : హెచ్‌డిపిపి కార్యదర్శి డా|| రమణప్రసాద్
జనవరి 05, తిరుపతి 2019: శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ 64వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు జనవరి 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయని, ఇందుకోసం పౌరాణిక నాటకాల ఎంపిక పూర్తయిందని పరిషత్ ఉపాధ్యక్షుడు, టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా|| రమణప్రసాద్ వెల్లడించారు. తిరుపతిలోని పురంధరదాస కాంప్లెక్స్‌లో గల పరిషత్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా|| రమణప్రసాద్ మాట్లాడుతూ జాతీయ నాటకోత్సవాల్లో 14 పౌరాణిక నాటకాలు, 5 పౌరాణిక నాటికలు, 12 సాంఘిక నాటకాలు, 33 ఏకపాత్రాభినయాలు, 17 లలిత సంగీతం కార్యక్రమాలను ఎంపిక చేశామన్నారు. మొత్తం 41 పౌరాణిక నాటకాలు, 11 పౌరాణిక నాటికలు, 44 సాంఘిక నాటకాలు, 93 ఏకపాత్రాభినయాలు, 59 లలిత సంగీతం దరఖాస్తులు అందినట్టు తెలిపారు.
నగదు బహుమతుల వివరాలు
పోటీల్లో పాల్గొన్న ప్రతి ప్రదర్శనకు పారితోషికం అందజేస్తారు. ఇందులో పౌరాణిక పద్య నాటకాలకు రూ.30 వేలు, పౌరాణిక పద్యనాటికలకు రూ.18 వేలు, పౌరాణిక పద్యనాటిక(పిల్లల విభాగం)లకు రూ.18 వేలు, సాంఘిక నాటికలకు రూ.15 వేలు, ఏకపాత్రాభినయాలకు రూ.2 వేలు, లలిత సంగీతం(స్థానికేతరులకు మాత్రమే) రూ.750/- పారితోషికం అందిస్తారు.
ప్రతి విభాగంలోనూ మొదటి మూడు ఉత్తమ ప్రదర్శనలకు గరుడ నగదు బహుమతులు అందిస్తారు. పౌరాణిక పద్య నాటకాల్లో ఉత్తమ ప్రదర్శనకు రూ.70 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.45 వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.30 వేలు, పౌరాణిక పద్య నాటికల్లో ఉత్తమ ప్రదర్శనకు రూ.25 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.12,500/-, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.9 వేలు, పౌరాణిక పద్య నాటికలు పిల్లల విభాగంలో ఉత్తమ ప్రదర్శనకు రూ.25 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.12,500/- వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.9 వేలు అందిస్తారు. అదేవిధంగా, సాంఘిక నాటికల్లో ఉత్తమ ప్రదర్శనకు రూ.22 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.11 వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.8,500/-, ఏకపాత్రాభినయంలో ఉత్తమ ప్రదర్శనకు రూ.4,116/-, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.3,116/-, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.2116/-, లలితసంగీతంలో ఉత్తమ ప్రదర్శనకు రూ.3,116/-, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.2,116/-, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.1,116/- అందజేస్తారు. ఈ నగదు బహుమతులతోపాటు ప్రతి కేటగిరీలోనూ 12 వ్యక్తిగత గరుడ అవార్డులు ప్రదానం చేస్తారు.
ఈ సమావేశంలో నాట్య కళా పరిషత్ కార్యదర్శి శ్రీ ఎల్.జయప్రకాష్, కమిటీ సభ్యులు శ్రీ కొత్తపల్లి మునిరత్నం, శ్రీ బిపి.శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.