మృదుమధురంగా సాగిన “భక్తి సంగీతం”
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మృదుమధురంగా సాగిన “భక్తి సంగీతం”
తిరుపతి 20 సెప్టెంబరు 2018 ; బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు గురువారం సాయంకాలం బ్రహ్మోత్సవాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో విజయవాడకు చెందిన శ్రీమతి మృదురవళి & బృందం గార్ల “భక్తిసంగీత” కార్యక్రమం భక్తజనావళిని భక్తిసాగరంలో ముంచెత్తారు. వీరు ఇదే వేదిక మీద అన్నమయ్య సంకీర్తనలను పలుమార్లు ఆలపించారు. వీరు చెన్నైకి చెందిన విదుషీమణి సరితా రామచంద్రన్ వద్ద సంగీతవిద్యను అభ్యసించారు. వీరు కేంద్రప్రభుత్వ స్కాలర్ షిప్ కూడా పొందారు.
నేటి కార్యక్రమం ఆసాంతం అన్నమాచార్య కీర్తనలను తమ మృదుమధుర కంఠంతో గానం చేసి సభను భక్తిసంద్రంలో ముంచెత్తారు. తమ కార్యక్రమాన్ని – ‘శ్రీవేంకటాచలాధీశం’ ప్రార్థనాశ్లోకంతో ప్రారంభించారు. అటుపై ‘నీ దాసుల భంగము నీవు చూతువా, నారాయణ తే నమో నమో, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగా నాంచారమ్మ, అవధారు నీవు, ఇన్ని చదువూలేల, ఒకపరికొక పరి ఒయ్యారమై, ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు’ అన్న కీర్తనలు గానం చేసి సభను మైమరపించారు. వీరికి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులైన మారుతీ రఘురాం మృదంగం పై, ఎల్ జయరాం వాయులీనం పైన సహకరించి సభను భక్తి పారవశ్యంలో ఓలలాడించారు. ఈ కార్యక్రమం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగింది.
అదేవిధంగా, తిరుపతి మహతి కళాక్షేత్రంలో సా.6.30 – 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన నాట్యాచార్య శివకుమార్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వాద్యసంగీత కార్యక్రమం నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.