OUR MOTTO IS TO PROVIDE PLEASANT DARSHAN TO COMMON PILGRIMS-TTD CHAIRMAN _ సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి విఐపి బ్రేక్ దర్శనం రద్దుకు యోచన: తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి విఐపి బ్రేక్ దర్శనం రద్దుకు యోచన: తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు
తిరుపతి, మార్చి 31, 2013: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసేందుకు యోచిస్తున్నట్టు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం ఆయన బోర్డు సభ్యులు శ్రీ చిట్టూరి రవీంద్రతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి విఐపి బ్రేక్ దర్శనం లేదన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం మినహా మిగిలిన సోమ, మంగళ, బుధవారాల్లోనూ రాత్రి విఐపి బ్రేక్‌ను రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఇది అమలైతే గురువారం మినహా వారమంతా రాత్రి విఐపి బ్రేక్ దర్శనం ఉండదని వివరించారు. ఉదయం మాత్రం యథావిధిగా బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు. దీనిపై తితిదే అధికారులు, పాలకమండలి సభ్యులు, భక్తులతో చర్చించామని, మరోమారు చర్చించి వచ్చే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.