ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2020 నవంబరు 11: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.30 నుండి 9.47 గంటల మధ్య ధనుర్లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం గత నెలలో జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. అమ్మవారి కరుణతో ప్రపంచ మానవాళి సుభిక్షంగా ఉండాలని, బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని సంకల్పం చేసినట్టు చెప్పారు.
గజపట ప్రతిష్ఠ :
ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.
సకలదేవతలకు ఆహ్వానం :
ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
రాగ, తాళ నివేదన :
రాగ స్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మ కోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువు కోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. అదేవిధంగా గాంధార రాగం, మురళీ రాగం, నాటభాగ రాగం, కల్యాణి రాగం – ఆదితాళం, భుజంగ రాగం – ధ్రువ తాళం, గరుడాఖ్యి రాగం, సావేరి రాగం – త్రిపుట తాళం, సుమంత రాగం – నాట తాళం, మధ్యమావతి రాగం – మధ్య తాళం, సౌరాష్ట్ర రాగం – రూపక తాళం, బేగడ రాగం – ఏక తాళం, రేగుప్త రాగం – శంబే తాళం, పంతువరాళి రాగం – మల్ల తాళం, సామంత రాగం, రామక్రియ రాగం – సింహళిక తాళం, కాంభోజి రాగం – సింహవిక్రమ తాళం, దేవగాంధార రాగం – శ్రీరంగ తాళం, కారీ రాగం – గజలీలా తాళం, వరాళి రాగం – చించత్పుర తాళం, అనంత తాళం, కౌషిక రాగం – ఘర్మ తాళం, ఘంటా రాగం – నృసింహ తాళం, భూపాల రాగం – సింహనాద తాళం ఆలపించారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ ప్రతాప్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవులు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.