PAVITHRALU SAMARPANA WENT OFF IN A COLOURFUL WAY _ తిరుమలలో ఘనంగా పవిత్రమాల సమర్పణ
తిరుమలలో ఘనంగా పవిత్రమాల సమర్పణ
తిరుమల, 18 ఆగష్టు : తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక సాలకట్ల పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజైన ఆదివారంనాడు పవిత్రమాలల సమర్పణ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది.
స్నపన తిరుమంజనం కార్యక్రమం అనంతరం శ్రీవారి ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు, తదితరులకు నూతన పవిత్ర మాలలను పూజలుచేసి అర్చకులు శాస్త్రోక్తంగా అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న శ్రీ భూవరాహస్వామి వారికి మరియు బేడి ఆంజనేయ స్వామివారికి కూడా పవిత్రమాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.
కాగా చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవ మొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారంకాని ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.
ఈ పవిత్రాలను వేద ఘోషల మధ్య, బాజాభజంత్రీల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు, ఇతర దేవతామూర్తులకు అందంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే. కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్, సి.వి.ఎస్.ఓ. శ్రీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
–
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.