అపురూపమైన పాత ఫొటోలు పంపాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి

అపురూపమైన పాత ఫొటోలు పంపాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి

ఆగస్టు 31, తిరుమల 2018: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన పాత ఫొటోలు శ్రీవారి భక్తుల చెంత ఉన్న పక్షంలో సెప్టెంబరు 7వ తేదీలోపు పంపవలసిందిగా భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ”నాడు-నేడు” పేరిట ఏర్పాటుచేసే ఫొటో ఎగ్జిబిషన్‌ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం విదితమే. శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవంలో భక్తులను భాగస్వాములను చేసేందుకు టిటిడి గత మూడు సంవత్సరాలుగా టిటిడి ఫొటోలతో పాటు భక్తుల నుండి వచ్చిన అపురూపమైన ఫొటోలను ప్రదర్శనలో ఉంచుతోంది.

తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతిలోని టిటిడి స్థానిక ఆలయాలు, ఇతర టిటిడి అనుబంధ ఆలయాలకు సంబంధించిన అపురూపమైన పాత ఫొటోలు కలిగిన భక్తులు ”ప్రజాసంబంధాల అధికారి (పిఆర్‌ఓ), టిటిడి పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి -517520” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 0877-2264217 ఫోన్‌ నెంబరును సంప్రదించగలరు.

ఈ ఏడాది సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో టిటిడి ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యపూజా విధానంలో వివిధ సందర్భాలలో వినియోగించే పాత్రలు, పూజాద్రవ్యాలు, ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల దినాల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలు తదితర అంశాలకు సంబంధించి విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు.

ఇందులో తరతరాల తిరుమల పేరిట 80 సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టే అరుదైన ఫొటోలు ఉంటాయి. 1950వ సంవత్సరానికి ముందు, ఆ తరువాత శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్వామీజీలు, సేవాతత్పరులు ఇతర ప్రముఖులు, తిరుమల తిరుపతిలోని శ్రీవారిసేవ వ్యవస్థ ఫొటోలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.