PUSHPA YAGAM HELD WITH GRANDEUR _శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

TIRUPATI, 09 DECEMBER 2021: Annual Pushpayagam held with celestial grandeur in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Thursday evening.

About 3.5tonnes of varieties of various flowers were offered to Goddess Sri Padmavathi Devi in this unique floral bath served at Sri Krishna Mukha Mandapam between 5pm and 8pm.

Earlier in the afternoon, these flowers were carried in a procession from Asthana Mandapam to the temple.

JEO Sri Veerabrahmam,  DyEOs Smt Kasturi Bai, Sri Ramana Prasad, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Prabhakar Reddy, Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుప‌తి, 2021 డిసెంబర్ 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో  ఏకాంతంగా పుష్పయాగం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారి మూలవర్లకు పుష్పాభిషేకం చేశారు.

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పాంచరాత్ర ఆగమసలహాదారు, కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పుష్ప‌యాగం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఉద్యాన శాఖకు దాతలు సమర్పించిన 3.5 టన్నుల పుష్పాలను  అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో ఒకటిన్నర టన్ను తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

పుష్పాల ఊరేగింపు :

మధ్యాహ్నం ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మండపాన్ని నలుపు, తెలుపు ద్రాక్షతో సుందరంగా అలంకరించారు. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది

 ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, డెప్యూటీ ఈఓ జనరల్ డా. రమణప్రసాద్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధుసూదన్, ఎవిఎస్వో శ్రీ సాయిగిరిధర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.