RATHOTSAVAM IN SRI KODANDA RAMA SWAMY TEMPLE _ అంగరంగ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం
అంగరంగ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం
తిరుపతి, మార్చి 18, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7.20 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత స్వామివారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధ, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.
సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు అర్చకులు రథమండపం నందు తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 8.30 గంటల నుండి 10.00 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించమని ప్రబోధిస్తున్నాడు.
సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయంలో సోమవారం ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీమతి ఎం.మీనాక్షి బృందం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో వరంగల్‌కు చెందిన శ్రీ గడ్డం వెంకటయ్య బృందం ”లవకుశ చరిత్ర” చిందు యక్షగానం ప్రదర్శించనున్నారు. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాల హరికథ విభాగాధిపతి శ్రీ సింహాచల శాస్త్రి ”పాదుకా పట్టాభిషేకం” హరికథను వినిపించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ రాజశేఖర్‌బాబు, ఎస్‌ఈ శ్రీ సుధాకరరావు, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.