RENDER SERVICES TO PILGRIMS WITH DEVOTION AND DEDICATION-TTD EO _ భద్రతా సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
భద్రతా సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, ఏప్రిల్ 10, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో పనిచేసే నిఘా, భద్రతా సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండి భక్తులకు రక్షణ కల్పించాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం విజిలెన్స్ దర్బార్ జరిగింది. తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నిఘా, భద్రతా విభాగంలో పనిచేయడం ఇతర ఉద్యోగాల కంటే చాలా కష్టమన్నారు. విధుల్లో నిబద్ధతతో పనిచేసి అక్రమాలు జరగకుండా చూడాలని, ఒక వేళ జరిగినా త్వరగా ఛేదించాలని అన్నారు. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి వచ్చే భక్తులతో గౌరవపూర్వకంగా ప్రవర్తించాలని, వారిని సేవిస్తే భగవంతుడిని సేవించినట్టేనని తెలిపారు. వేదాంతపరమైన పరిజ్ఞానం పెంచుకుంటే ప్రతిరోజూ నూతనోత్సాహంతో విధులు నిర్వహించవచ్చన్నారు. ధనం కోసం పాకులాడడం తగదని, వ్యక్తిగత ఔన్నత్యం కోసం పని చేయాలని సూచించారు. భద్రతా సిబ్బంది తిలకధారణ చేసుకోవాలని ఆయన కోరారు.
తితిదే తిరుపతి జెఇఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు భద్రత కల్పించడం భద్రతా సిబ్బంది బాధ్యతన్నారు. శిక్షణ తరగతుల ద్వారా మరింత నైపుణ్యం పెంచుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి పాలనాపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తితిదే తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రసంగిస్తూ నిఘా, భద్రతా సిబ్బందికి స్వీయ నియంత్రణ ఉండాలని సూచించారు. సక్రమంగా విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందాలన్నారు. బాగా పనిచేసినప్పుడు సమస్యల పరిష్కారం ఇంకాస్త సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు సివిఎస్‌ఓ ప్రసంగిస్తూ నిఘా, భద్రతా విభాగంలో సిబ్బందికి ఎదురవుతున్న సవాళ్లను, వాటిని ఎదుర్కొనడానికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం తితిదే సెక్యూరిటీ, ఎస్‌పిఎఫ్, ప్రయివేటు సెక్యూరిటీ, మహిళా ప్రయివేటు సెక్యూరిటీ, కమెండో, హోంగార్డులు తమ సమస్యలను తితిదే ఉన్నతాధికారుల ముందు ఉంచారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఈవో హామీ ఇచ్చారు.
ఆ తరువాత మెరుగ్గా విధులు నిర్వహించిన ఎవిఎస్‌వోలు శ్రీ కాటంరాజు, శ్రీ విశ్వనాథం, కోటేశ్వరబాబు, ఇతర నిఘా, భద్రత సిబ్బందికి తితిదే ఈఓ రివార్డులు, నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అదనపు నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, విజిఓ శ్రీ హనుమంతు, ఇతర అధికార ప్రముఖులు, నిఘా మరియు భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.