SAKALA KARYA SIDDHI SRIMAD RAMAYANA PARAYANAM COMMENCES AT VASANTA MANDAPAM _ వసంతమండపంలో శ్రీమద్రామాయణ పారాయణం ప్రారంభం
Tirumala, 25 JULY 2021: The unique Sakala Karya Siddhi Srimad Ramayana Parayanam commenced with spiritual ecstasy in Vasanta Mandapam at Tirumala on Sunday.
A total of 32 Vedic scholars will be taking part in this programme were 16 of them will recite the important slokas from different Kandas in the Epic Ramayana while another 16 Vedic experts will perform Japa and Homam in SV Veda Vijnana Peetam at Dharmagiri in Tirumala for 30 days from July 25 to August 23.
As a part of this month-long programme, on the first day, 218 slokas from 21-25 Chapters and 123 slokas from the Pattabhishekam episode in Yuddhakanda were recited.
CEO SVBC Sri Suresh Kumar, Dharmagiri Veda Vignana Peetham Sri KSS Avadhani, Higher Vedic Studies Special Officer Dr A Vibhishana Sharma were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వసంతమండపంలో శ్రీమద్రామాయణ పారాయణం ప్రారంభం
తిరుమల, 2021 జులై 25: శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో శ్రీమద్రామాయణ పారాయణం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 23వ తేదీ వరకు 30 రోజుల పాటు ఈ పారాయణం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పారు. మోక్షసాధనే మానవ జీవితానికి సార్థకత అన్నారు. ఈ పారాయణ గ్రంథాన్ని ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని పారాయణం చేసుకోవచ్చని తెలిపారు. రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలోని ప్రధానమైన సర్గలను రోజుకు ఒకటి చొప్పున పారాయణం చేస్తామన్నారు. అయితే జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో గల 120 శ్లోకాలను 30 రోజుల పాటు పారాయణం చేస్తామని వివరించారు. మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేదపండితులు పాల్గొంటున్నారని చెప్పారు.
తొలిరోజు ధర్మకార్యసిద్ధి కోసం పారాయణం
తొలిరోజు ధర్మకార్యసిద్ధి కోసం అయోధ్యకాండలోని 21 నుండి 25 సర్గల్లో గల 221 శ్లోకాలు, జన్మాంతర సకలసౌఖ్యప్రాప్తి కోసం యుద్ధకాండలోని 131వ సర్గలో గల 120 శ్లోకాలు కలిపి మొత్తం 341 శ్లోకాలను పారాయణం చేశారు. ముందుగా హనుమత్ సీతాలక్ష్మణభరతశత్రుజ్ఞ సమేత శ్రీరాములకు పూజలు నిర్వహించి ఐదు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పండితులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.