“SAVE GOMATA-SAVE HINDU SANATANA DHARMA”-TTD EO _ గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 ఆగస్టు 10: సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ శ్రీకృష్ణభగవానుడు ఎక్కువ సమయం గోవులతోనే గడిపినట్టు పురాణాలు చెబుతున్నాయని, ఆ విధంగా స్వామివారికి గోవులు ఎంతో ఇష్టమైనవన్నారు. భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గోపూజ చేసి శ్రీకృష్ణభగవానుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. గోవధను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
భారతీయులు శ్రీకృష్ణడిని జగద్గురువుగా భావిస్తారని, అన్ని శాస్త్రాల్లో ఆయనకు మించిన గురువు లేరని ఈఓ అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించారని, ఆయన అవతరించిన ప్రాంతంలో పుట్టిన తిరుమల, తిరుపతివాసులు ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు. స్వామివారి చెంత ఉన్నప్పుడు ఆయన నిర్దేశించిన మార్గంలోనే అందరూ నడవాలని, ఎలాంటి అపరాధానికి, అధర్మానికి తావివ్వకూడదని సూచించారు. స్వామిని వేడుకుంటే అన్ని ఉపద్రవాలు, ఉన్మాదాలు, ఉగ్రవాదాల నుండి విముక్తి కలుగుతుందన్నారు.
ముందుగా ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శ్రీ వేణుగోపాలస్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోపూజ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీమహామంత్ర పీఠం అధ్యకక్షుడు పి.సాయిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదు నుండి తిరుపతికి వచ్చిన శ్రీమహామంత్ర రథం వద్ద ఈఓ పూజలు చేశారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే పదో సారి ఏడు కోట్ల గోవిందనామ జపాల పుస్తకాలను శ్రీ వేంకటేశ్వర మహామంత్ర స్థూపం వద్ద సమర్పించారు. 11వ సారి సమర్పించేందుకు గాను తితిదే అధికారులు గోవిందనామాన్ని పుస్తకాల్లో రాసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీ బాలహనుమంతరెడ్డి అనే భక్తుడు ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు లక్ష రూపాయల విరాళాన్ని ఈవోకు అందించారు. అనంతరం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ శబరిగిరీష్ ఆలపించిన, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రూపొందించిన ”శ్రీకృష్ణామృతం” ఆడియో సిడిలను ఈఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల హరికథ విభాగం అధ్యాపకులు శ్రీ సింహాచల శాస్త్రి ‘మానవ ధర్మాచరణలో గోమాత ప్రాముఖ్యత’ అనే అంశంపై ఉపన్యసించారు. ఈ సందర్భంగా అన్నమచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన నాదస్వర కచేరి, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
గోశాల సంచాలకులు డాక్టర్ కె.హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం న్యాయాధికారి శ్రీ డి.సుబ్రమణ్యం, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నస్వామి, ముఖ్య గణాంకాధికారి శ్రీ శేషశైలేంద్ర, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, ఆరోగ్య శాఖ అధికారి శ్రీ భీష్మయ్యనాయుడు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.