SERVE THE PILGRIMS WITH SPIRITUAL ENLIGHTENMENT-TTD EO _ ఆధ్యాత్మిక చైతన్యంతో భక్తులకు సేవలందించండి-శ్రీవారి సేవకులకు ఇ.ఓ పిలుపు
ఆధ్యాత్మిక చైతన్యంతో భక్తులకు సేవలందించండి-శ్రీవారి సేవకులకు ఇ.ఓ పిలుపు
తిరుమల, 03 మే – 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయుకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుండి లక్షలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యంతో శ్రీవారిసేవకులు సేవలందించాలని తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.
శుక్రవారంనాడు తిరుమలలోని ఆస్థానమండపంలో శ్రీవారిసేవకులను ఉద్దేశించి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తి.తి.దే ఇ.ఓ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇ.ఓ తమ ప్రసంగంలో ”జంతూనాం నరజన్మ దుర్లభం” అని శంకర భగవత్పాదులవారు తెలిపారన్నారు. అంటే భగవంతుని సృష్టిలో మనుష్యజన్మ అత్యంత ఉత్కృష్టమైనదని, అందులోను శ్రీవారిసేవకులుగా సాటి భక్తులకు సేవలందించడం భగవంతుడిచ్చిన మహద్భాగ్యం అన్నారు. ఆ సేవను కూడా ఆధ్యాత్మిక చైతన్యంతో అందించగలగడం మరింత విశేషమన్నారు. అయితే తిరుమలకు వివిధ ప్రాంతాలనుండి వివిధరకాల వ్యక్తులు దర్శనానికి విచ్చేస్తూ ఉంటారన్నారు. వీరి ఆధ్యాత్మిక ఎదుగుదల ఏస్థాయిలో ఉన్నదో ఎవరికీ తెలియదన్నారు. అటువంటి భక్తులకు సేవ చేయాలంటే ముందు మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలను అంతఃశ్శోధించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఒంటరిగానే సాగుతుందన్నారు.
భగవంతుని దర్శనానికి సుదూర ప్రాంతాలనుండి విచ్చేసే భక్తులకు స్వార్థరహిత సేవలను అందించాల్సిన బాధ్యత శ్రీవారిసేవకు విచ్చేసే ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అహంకారాన్ని చంపుకొని భక్తులకు సేవచేయగలిననాడే భగవంతుని భక్తునిలో దర్శించవచ్చునన్నారు. శ్రీవారిసేవలో మనంపాటించే నడవడిక మన జీవితానికి ఆదర్శప్రాయం కావాలన్నారు. తద్వారా మనం సమాజానికి ఆదర్శమౌతామన్నారు. శ్రీవారిసేవకులు భక్తులకు సేవచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమజీవితానికి సార్థకత పొందాలన్నారు.
అంతకు పూర్వం శ్రీ వేంకటేశ్వరఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీనాగేంద్రసాయి, పతంజలియోగ అధ్యయన సంస్థ నిపుణులు శ్రీ తంగనాడార్, కల్యాణకట్ట డిప్యూటి.ఇ.ఓ శ్రీ కృష్ణారెడ్డి శ్రీవారిసేవకులకు తమ సందేశాలనిచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రజాసంబంధాదికారి శ్రీ టి.రవి అధ్యక్షత వహించగా, వందన సమర్పణను సహాయ ప్రజాసంబంధాదికారిణికకు. పి.నీలిమ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుండి 2500లకు పైగా శ్రీవారిసేవకులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.