“SERVICE IN LORD’S ABODE IS A PLEASANT MEMORY”-TTD EO LV SUBRAMANYAM _ ”తిరుమలలో ఉద్యోగ పర్వం ఓ దివ్యానుభూతి” – ఇఓ శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం
”తిరుమలలో ఉద్యోగ పర్వం ఓ దివ్యానుభూతి” – ఇఓ శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం
తిరుమల, 05 జూలై 2013 : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి క్షణిక దర్శనమే దుర్లభమైనప్పుడు రెండు సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేయడం మహద్భాగ్యమని బదిలీపై రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్ వెళ్ళనున్న తితిదే ఇఓ శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం అన్నారు.
శుక్రవారం నాడు తిరుమలలో దర్శనానంతరము ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన 30 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువులో రెండు సంవత్సరములు విధులు నిర్వహించిన తృప్తి తన జీవితంలో మరచిపోలేని ఒక మధురానిభూతి అన్నారు. ఇది కేవలం తన పూర్వీకులు, తల్లిదండ్రులు, గురువులు నేర్పిన విద్య,సంస్కారం మూలంగానే సాధ్యమైనదని అన్నారు.
స్వామి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎంత సేవ చేసినా ఇంకా చేయవలసిన సేవ మిగిలే వుంటుందన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో పరిపాలనా పరంగా విధులు తాను సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన భక్తులకు, సహఉద్యోగులు, అందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు.
కాగా అంతకు పూర్వం శ్రీవారి ఆలయంలో ఇఓ శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం కుటుంబ సమేతంగా ఆలయ మర్యాదలతో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వైదికులు వేదాశీర్వచనం పలికారు. తరువాత తిరుమల జెఇఓ శ్రీ కె.యస్.శ్రీనివాసరాజు ఇఓకు శ్రీవారి లడ్డూ ప్రసాద తీర్థాలను, శ్రీవారి చిత్ర పటాన్ని కానుకగా సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సీ.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ చిన్నంగారి రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శనివారం నాడు నూతన ఇఓగా శ్రీ ఎం.జి.గోపాల్ ప్రమాణ స్వీకారం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి 23వ కార్యనిర్వహణాధికారిగా శ్రీ ముక్కామల గిరిధర్ గోపాల్ శనివారం తెల్లవారుఝామున 4.14 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అనంతరం ఉ.11.00 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అటు తరువాత తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో, సిబ్బందితో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు.
సా.4.00 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తితిదే ఉద్యోగులు ఏర్పాటు చేసిన పూర్వ ఇఓ శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం వీడ్కోలు సభలో పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.