SPIRITUAL FERVOUR MARKS VARALAKSHMI VRATAM IN TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం

Tiruchanoor, 24 August 2018: Devotional fervour reached its zenith on Friday on the auspicious occasion of Varalakshmi Vratam organised by TTD in Astana Mandapam of Tiruchanoor.

The religious event lasted for over two hours between 10am and 12noon. Sri Babu Swamy rendered the Sahasranamam of Sri Padmavathi Devi while Sri Srinivasacharyulu narrated the importance of Varalakshmi Vratam as taught by Lord Shiva to His spouse Parvathi Devi.

The stage was colourfully decked with varieties of flowers and illumination with electrical illumination.

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Bhaskar, Tirumala JEO Sri KS Sreenivasa Raju, temple Spl.Gr.DyEO Sri Munirathnam Reddy, VGO Sri Ashok Kumar Goud and other officials, large number of devotees took part in the celestial fete.

While in the evening Goddess will be taken on a pleasure ride on golden chariot along the streets encircling the shrine.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం

తిరుపతి, 24 ఆగస్టు 2018 ;సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది.వరలక్ష్మీవ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి, తామరపూలు, మెగళిరేకులు వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు. ఆస్థానమండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఓం శ్రీ కమలాయైనమః, ఓం శ్రీ రమయైనమ, ఓం శ్రీ లోకమాత్రేనమ, ఓం శ్రీ విశ్వజనన్యైనమః, ఓం శ్రీ మహాలక్షియైనమః, ఓం శ్రీ క్షీరాబ్దితనయైనమః, ఓం శ్రీవిశ్వసాక్షిన్యైనమ, ఓం శ్రీ చంద్ర సహోదరిన్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మియై నమః అని ఆరాధించారు.

అనంతరం వేంకటాచల మహత్యం స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలితం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు.

తరువాత ఐదు రకాల కుడుములు, ఇడ్లి, కారంతో చేసిన ఇడ్లి, తియటి ఇడ్లి, లడ్డు, వడ, అప్పం, పోలి వంటి 12 రకాల నైవేధ్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. కావున శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతా,నం దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. ఈ పర్వదినాన అమ్మవారికి బంగారుచీరతో విశేష అలంకరణ చేసినట్లు వివరించారు.

అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ఆస్థాన మండపంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. అదేవిధంగా దాదాపు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు కంకణాలు, పసుపు ధారాలు, పసుపు, కుంకుమ, గాజులు పంపీణి చేస్తున్నట్లు తెలిపారు.

భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం

టిటిడి గార్డెన్‌ విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. గార్డెన్‌ విభాగానికి చెందిన 30 మంది సిబ్బంది, మూడు రోజుల పాటు శ్రమించి వ్రత మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.

ఇందులో అపిల్‌, ద్రాక్ష, దానిమ్మ, బత్తయి, పైనిపిల్‌ వంటి సాంప్రదాయ ఫలలు, వివిధ సాంప్రదాయ పుష్పలతో వ్రత మండపాన్ని సర్వంగా సుందరంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, క్రింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

స్వర్ణరథోత్పవం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జ్‌ సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, విజివో శ్రీ ఆశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.