sri pat annual pavithrotsavam concludes with purnahuthi _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, 2012 సెప్టెంబరు 29: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు శనివారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనముతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ మధ్యాహ్నం 11.30 గంటల నుండి 12.00 గంటల వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనము, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి 4.30 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.
సాయంత్రం 6.00 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి రక్షాబంధనము, ఆచార్య, రిత్విక సన్మానముతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి దంపతులు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈఓ శ్రీ గోపాలకృష్ణ, ఆలయ అర్చకులు, ఏఈఓ శ్రీ వేణుగోపాల్ ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.