వేసవి తరువాత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు : డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 జూన్ 10: వేసవి తరువాత తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన జరుగుతోందని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. శ్రీనివాస్ – రైల్వేకోడూరు
ప్రశ్న: 2018 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంచగవ్య ఉత్పత్తులతో నేను తయారుచేసిన తెగుళ్ల నివారణ మందు రైతులకు అందేలా చూడండి ?
ఈవో : టిటిడి గోశాల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ రైతులకు తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీ ఉత్పత్తిని మాకు అందిస్తే రైతులకు అందేలా చూస్తాం.
2. రాజు – పీలేరు
ప్రశ్న: తిరుమల గదుల కేటాయింపు కౌంటర్లు తగ్గించారు?
ఈవో : తిరుమలలో 7 వేల గదులు, 5 పిఏసిలు ఉన్నాయి. 800 గదులు మరమ్మతుల్లో ఉన్నాయి. మిగిలిన వాటిలో 50 శాతం గదులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాం. మిగిలిన 50 శాతం గదులను కరంట్ బుకింగ్‌లో కేటాయిస్తున్నాం. ఈ ప్రకారం 40 వేల మందికి మాత్రమే తిరుమలలో బస కల్పించగలం. అదనంగా గదులు నిర్మించడానికి సాధ్యం కావడం లేదు. తిరుమలలో కొత్తగా నిర్మాణాలు చేయకూడదని కోర్టు తీర్పు ఉంది. గదులు తక్కువగా ఉండడంతో కౌంటర్ల సంఖ్యను 6 నుండి 4కు తగ్గించడం జరిగింది.
3. సమత – హైదరాబాద్, ద్వారక – నెల్లూరు
ప్రశ్న: ఎస్వీబీసీ ప్రసారాలు బాగున్నాయి. చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రి కోసం ఒక లక్ష విరాళం ఇస్తూ మెయిల్ పంపాను. అక్నాలెడ్జిమెంట్ రాలేదు ?
ఈవో : మీ వివరాలు తీసుకుని అక్నాలెడ్జిమెంట్ అందేలా చూస్తాం. శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతులమీదుగా భూమిపూజ జరిగింది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు పరిధిలో దీన్ని చేర్చాం. ఒక కోటి విరాళం ఇచ్చిన వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రోత్సాహకంగా ఒక ఉదయాస్తమాన సేవా టికెట్ ఇవ్వాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. సిఎస్ఆర్ నిధులు కూడా విరాళంగా అందించవచ్చు.
4. రమేష్‌బాబు – బొబ్బిలి
ప్రశ్న: విశేషపూజను ఎందుకు రద్దు చేశారు ?
ఈవో : తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యకట్ల సేవలను ప్రతిరోజూ తప్పకుండా నిర్వహిస్తున్నాం. ఆలయ నిర్వహణకు కావాల్సిన ఆదాయం కోసం నిర్వహించే సేవలను ఆర్జిత సేవలు అంటారు. వీటిలో వారపు సేవ అయిన విశేషపూజ ఒకటి. అభిషేకాల వల్ల స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా నివారించేందుకు విశేషపూజ, సహస్రకలశాభిషేకం, వసంతోత్సవం లాంటి ఆర్జితసేవలను వార్షిక సేవలుగా నిర్వహిస్తున్నాం. జియ్యంగార్లు, ఆగమ సలహామండలి, అర్చకుల నిర్ణయం మేరకు విశేష పర్వదినాల సమయంలో ఆర్జిత సేవలను రద్దు చేయడం జరుగుతుంది. కోవిడ్ సమయంలోనూ ఆర్జిత సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
5. సుబ్బారావు -ఖమ్మం
ప్రశ్న: శ్రీవారి ఆలయంలో హుండీ వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది ?
ఈవో : ప్రస్తుతం ఒక గంటలకు సుమారు 4 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కావున రద్దీ ఉంటోంది. ఇందుకోసమే మూడు నుంచి నాలుగు హుండీలు పెడుతున్నాం.
6. శ్రీనివాస్ – శ్రీశైలం
ప్రశ్న: అలిపిరి టోల్‌గేట్ వద్ద తనిఖీల సమయంలో వృద్ధులు కిందికి దిగి నడవాలంటే ఇబ్బంది పడుతున్నారు?
ఈవో : ప్రపంచంలో హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా తిరుమలను భావిస్తున్నారు. భక్తుల భద్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. కావున ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తున్నాం.
7. దుర్గారావు – గొల్లపూడి
ప్రశ్న: విజయవాడలో గదులు, సేవా టికెట్లు బుక్ చేసుకునేందుకు కౌంటర్ ఏర్పాటుచేయండి?
ఈవో : భక్తులందరి సౌలభ్యం మేరకు గదులు, సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించాం.
8. సురేష్ – బెంగళూరు
ప్రశ్న: పరకామణి సేవకు వయోపరిమితిని 58కి తగ్గించారు. పెంచగలరు?
ఈవో : 50 ఏళ్లు పైబడినవారు పరకామణి సేవ చేయలేకపోతున్నారు. నూతన పరకామణి భవనం అందుబాటులోకి వచ్చాక వయోపరిమితిని పెంచుతాం.
9. శ్రీనివాస్ – గుంటూరు
ప్రశ్న: ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు పొందినవారికి గదులు కూడా కేటాయించండి ?
ఈవో : ఆన్‌లైన్ డిప్ విధానంలో సేవాటికెట్లు పొందినవారికి గదులు కేటాయిస్తున్న తరహాలో దర్శన టికెట్లు పొందిన వారికి కూడా అవకాశం కల్పిస్తాం.
10. అరవింద్ – గోరంట్ల, రాజు – శ్రీకాకుళం, ప్రతాప్ – చిత్తూరు
ప్రశ్న: సర్వదర్శనంతోపాటు టైంస్లాట్ దర్శనం పెట్టండి ?
ఈవో : ఈ విధానంలో ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతానికి నిలిపివేశాం. వేసవి తరువాత తిరిగి ప్రారంభిస్తాం. ఇందుకోసం తిరుపతిలోని కౌంటర్ల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం.
11. సుకుమార్ – కడప, కనకదుర్గ – ఖమ్మం
ప్రశ్న: నడవలేని వృద్ధులను వీల్‌ఛైర్‌లో ఆలయంలోకి అనుమతిస్తారా ?
ఈవో : మహద్వారం వరకు వీల్‌ఛైర్‌లో రావచ్చు. అక్కడి నుండి శ్రీవారి సేవకుల సహాయంతో దర్శనం కల్పిస్తాం.
12. నాగేశ్వరరావు – గుంటూరు, శ్రీరామశాస్త్రి – హైదరాబాద్.
ప్రశ్న: మీ పదవీకాలం పొడిగించినందుకు శుభాకాంక్షలు. అన్నప్రసాద భవనంలో వడ్డించడం బాగా ఆలస్యమవుతోంది ?
ఈవో : మీకు ధన్యవాదాలు. ఇప్పటివరకు తన పదవీకాలంలో తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. 214 మంది దళారులను అరెస్టయ్యారు. 142 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 217 మంది దళారులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించి రూ.10 వేలు విరాళం ఇచ్చిన వారికి బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తున్నాం. ఈ ట్రస్టుకు ఒక సంవత్సరంలో రూ.230 కోట్ల విరాళాలు అందాయి. ఈ నిధులను శ్రీవారి ఆలయ నిర్మాణాలకు, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి, హిందూ ధర్మపరిరక్షణకు ఖర్చు చేస్తున్నాం. అన్నప్రసాద భవనంలో ఆలస్యం లేకుండా చూస్తాం.
13. సంధ్య – హైదరాబాద్, లక్ష్మీనారాయణ – నెల్లూరు
ప్రశ్న: ఎస్వీబీసీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. పండితులకు కృతజ్ఞతలు. పరిశుభ్రత బాగుంది. ఉదయగిరిలో శిథిలావస్థకు చేరుకున్న వందల సంవత్సరాల నాటి శ్రీకృష్ణస్వామి, శ్రీ రంగనాయకులస్వామివారి ఆలయాలను పునరుద్ధరించండి ?
ఈవో : ఎస్వీబీసీ యోగ దర్శనం కార్యక్రమం అనంతరం గరుడపురాణం ప్రవచనం త్వరలో ప్రారంభిస్తాం. మహాభారతం ప్రవచనాలు పూర్తయిన తరువాత మహాభాగవతం ప్రవచనాలు ప్రారంభిస్తాం. శిథిలావస్థకు చేరుకున్న వందల సంవత్సరాల నాటి శ్రీకృష్ణస్వామి, శ్రీ రంగనాయకులస్వామివారి ఆలయాలను శ్రీవాణి ట్రస్టు ద్వారా పునరుద్ధరిస్తాం.
14. నాగేశ్వరరావు – తిరుపతి
ప్రశ్న: హెచ్‌డిపిపి ఆధ్వర్యంలోని యోగాధ్యయన కేంద్రం మూడేళ్లుగా మూలనపడింది. పునరుద్ధరిస్తే నా వంతు సహకారం అందిస్తాను?
ఈవో : ఎస్వీబీసీలో యోగ దర్శనం ప్రసారమవుతోంది. మీ సహకారంతో ప్రాక్టికల్‌గా యోగాసనాలను చేయిస్తాం.
15. అన్నపూర్ణ – గుడివాడ
ప్రశ్న: అష్టాదశ పురాణాలు ముద్రించి భక్తులకు అందించండి?
ఈవో : ఇప్పటికే 5 పురాణాల ముద్రణ పూర్తయింది. మిగిలిన 13 పురాణాలను అర్థతాత్పర్యాలతో ముద్రించి రెండేళ్లలో భక్తులకు అందిస్తాం.
పారాయణ కార్యక్రమాలకు భక్తుల నుండి విశేష స్పందన…
తిరుమల నాదనీరాజనం వేదికపై టిటిడి నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమాలకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ పారాయణాల్లో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు తెలియజేశారు. కోవిడ్ మహమ్మారిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మరో రెండేళ్లు పొడిగింపు రావడంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.