STUDENTS SHOULD APPLY “SADACHARAM” IN THEIR CAREER- TTD EO _ సదాచారాలు మంచి జీవితానికి మార్గదర్శకాలు : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
సదాచారాలు మంచి జీవితానికి మార్గదర్శకాలు : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, మార్చి 28, 2013: మంచి జీవితాన్ని పొందాలనుకునేవారికి సదాచారాలు మార్గదర్శకంగా నిలుస్తాయని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం సదాచారం శిక్షణ తరగతుల విజయోత్సవం నిర్వహించారు.
తితిదే ఈవో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సదాచారం శిక్షణ తరగతుల్లో బోధించిన విషయాలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని సూచించారు. విద్యార్థులు ఏ వృత్తిలో స్థిరపడినా అకుంఠిత దీక్షతో బాధ్యతలు నిర్వహించాలని, అప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. అనంతరం ఇప్పటినుంచే సదాచారాలను ఆచరణలో పెడతామంటూ విద్యార్థులతో ఈవో ప్రతిజ్ఞ చేయించారు.
తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ప్రసంగిస్తూ సదాచారమే పరమధర్మమన్నారు. తితిదే పాఠశాల విద్యార్థులు ఆచార ధర్మాలను పాటించాలని, మీ వల్ల వేదధర్మం విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ ప్రస్తుతం తల్లి ఒడి, బడి, గుడి నుండి సంస్కారం అందడం లేదని, అందుకే ఇలాంటి కార్యక్రమాల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.
అంతకుముందు సదాచారం శిక్షణ తరగతులపై అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. పలువురు విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను అత్యంత అద్భుతంగా వివరించి సభికుల మన్ననలు అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల్లో యువతకు బోధించేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తితిదే ఈవో బహుమతులు ప్రదానం చేశారు. అధ్యాపకులను శ్రీవారి ప్రసాదం, శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, విద్యాశాఖాధికారి శ్రీ శేషారెడ్డి, సేవల విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శివారెడ్డి, ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్ ఇతర అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.