SUNDARARAJA SWAMY UTSAVAM COMMENCES _ వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 27 JUNE 2024: The three day Sundararaja Swamy Avatara Utsavams commenced on a grand religious note in the sub temple of Sri Padmavati Devi temple at Tiruchanoor on Thursday.
 
In the evening unjal seva was performed in Sri Krishna Mukha Mandapam. On first day the utsava deity blessed His devotees on Pedda Sesha Vahanam.
 
AEO Sri Ramesh and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 27 జూన్ 2024: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు.

సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా శుక్రవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం :

శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు (ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ రమేష్, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.