SURYAPRABHA VAHANAM _ సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం
సూర్యప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం
తిరుపతి, మార్చి 17, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం.
వాహన సేవ అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరగనుంది.
చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నాడు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయంలో ఆదివారం ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీమతి ఎం.ఆర్.సుధామణి బృందం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుపతి అభినయ ఆర్ట్స్ వారు ”సీతా స్వయంవరం” నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద అనంతపురం జిల్లా నిమ్మనపల్లికి చెందిన శ్రీ శ్రీనివాసులు బృందం ”సుందరకాండ” తోలుబొమ్మలాటను ప్రదర్శించనున్నారు.
అలాగే ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు శ్రీ కోదండరామాలయంలో స్వామివారి డోలోత్సవ సమయంలో శ్రీమద్రామాయణ గోష్ఠి నిర్వహించారు. వాల్మీకి మహర్షికి, సప్తరుషులకు మధ్య జరిగిన సంవాదమే శ్రీమద్రామాయణ గోష్ఠి. ఈ గోష్ఠిలో సప్తరుషులు ఒక్కొక్కరు ఒక్కో శ్లోకంలో రామాయణ కాండాలు, అధ్యాయాలు పేర్కొంటూ వాల్మీకి సందేహాలను నివృత్తి చేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అనంతరం వాల్మీకి శ్రీరామాయణ రచనకు శ్రీకారం చుట్టినట్టు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రథోత్సవానికి సర్వం సిద్ధం : జెఈవో
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7.20 గంటలకు జరుగనున్న రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నందున తగిన భద్రత, అన్నప్రసాదం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులందరికీ రథాన్ని లాగే అవకాశం కల్పిస్తామని, పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.