ఎస్వీ సంగీత కళాశాలలో ముగిసిన సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ సంగీత కళాశాలలో ముగిసిన సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

మార్చి 14, తిరుపతి, 2018 ; తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో మూడు రోజులపాటు జరిగిన సంగీత త్రిమూర్తులు శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీత్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.

ముందుగా ప్రవీణ, విశారద విద్యార్థులతో పాటు శ్రీ బి.కేశన్న, శ్రీ కె.ఈశ్వరయ్య బృందం నాదస్వర వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సంగీత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, స్థానిక కళాకారులు పలు కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీ ఎం.సురేంద్ర, జి.చెన్నయ్య వయొలిన్‌, శ్రీ వి.సురేష్‌బాబు గాత్రం, శ్రీ కెవి.కృష్ణ వయొలిన్‌, శ్రీ ఎం.అనంతకృష్ణ వేణువు వాద్యప్రదర్శనలు ఇచ్చారు. హరికథ విభాగాధిపతి శ్రీ ఎం.వి.సింహాచలశాస్త్రి త్రిమూర్తుల సంగీత సాహితి వైభవంపై హరికథ వినిపించారు.

మూడు రోజుల పాటు జరిగిన ఆరాధనోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9.25 గంటల వరకు సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, స్థానిక కళాకారులు సంగీత త్రిమూర్తుల అపురూప కృతులు, కీర్తనలను రోజుకు 90 చొప్పున ఆలపించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ ఎం.రామచంద్ర, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వైవిఎస్‌.పద్మావతి, నాదస్వర పాఠశాల హెడ్‌మాస్టర్‌ శ్రీ సత్యనారాయణ, అధ్యాపకులు శ్రీ సుధాకర్‌ తదితర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.