THREE DAY ANNUAL PAVITHROTSAVAMS IN SRI KODANDARAMA SWAMY TEMPLE BEGINS _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం
శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, ఆగస్టు 02, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.