శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా తులసి మహత్యం ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి, 2019 ఆగస్టు 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, విశ్వరూప దర్శనం కల్పించారు. ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
అనంతరం శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు బంగారు వాకిలి చెంత సింహాసనంపై వేంచేపు చేశారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.