TIRUMALA JEO REVIEWS ON 2013 BRAHMOTSAVAM ARRANGEMENTS _ అక్టోబరు 5 నుండి 13వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 5 నుండి 13వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 19న ప్రయోగాత్మకంగా గరుడసేవ
తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుమల, జూలై 24, 2013: ఈ ఏడాది అక్టోబరు 5 నుండి 13వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ దాదాపు రెండు నెలల ముందుగానే తొలివిడత సమీక్ష నిర్వహించడం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయవచ్చని ఆయన విభాగాధిపతులకు సూచించారు. సమావేశం అనంతరం జెఈవో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 5వ తేదీన ధ్వజారోహణం, అక్టోబరు 9న గరుడసేవ, అక్టోబరు 10న స్వర్ణరథం, అక్టోబరు 12న రథోత్సవం, అక్టోబరు 13న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగనున్నట్టు తెలిపారు. సెప్టెంబరు 19వ తేదీ పౌర్ణమి గరుడ సేవను పురస్కరించుకుని అన్ని విభాగాలతో కలిసి ప్రయోగాత్మకంగా బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఆగస్టు 16 నుండి సెప్టెంబరు 14వ తేదీ వరకు స్వామివారి పుష్కరిణి మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు జెఈవో వెల్లడించారు. చేపడుతున్న ఏర్పాట్లపై ఆగస్టు 31వ తేదీన తితిదే కార్యనిర్వహణాధికారి అన్ని విభాగాల అధికారులతో పునఃసమీక్షిస్తారని తెలిపారు. గతేడాది బ్రహ్మోత్సవాల్లో లాగానే వాహన సేవల సమయంలో నిర్దేశిత పాయింట్ల వద్ద భక్తులు హారతులు ఇచ్చేందుకు అనుమతిస్తామన్నారు. హారతులిచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆయన కోరారు. గతేడాది లాగా మీడియా సెంటర్, ఫలపుష్ప ప్రదర్శన, ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి సేవలందించేందుకు నాలుగు వేల మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి సేవలో భాగంగా భక్తులకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు.
ఆరోగ్య శాఖలో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా 500 మంది సిబ్బందిని తీసుకొంటున్నట్టు చెప్పారు. మొత్తం ఏడు చోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి వాహనసేవలో ప్రముఖుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేస్తామని, గరుడ సేవ రోజు తిరుమలకు ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని, బస్సులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు జెఈవో తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.