శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్పస్వామివారు

శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్పస్వామివారు

తిరుమల, 2019, జనవరి 01: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ ”తన్నీరముదు” ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబివారికి మేల్‌చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు.

శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. పౌరాణిక ప్రాశస్త్యం మేరకు శ్రీ తిరుమలనంబి క్రీ.శ. 973వ సంవత్సరంలో పవిత్ర పురట్టాసి మాసంలో అనూరాధ నక్షత్రంలో జన్మించారు. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ. ప్రతిరోజూ పాపవినాశతీర్థం నుండి కుండలో నీరు తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో స్వామివారికి దైనందిన పాదపూజ నిర్వహించేవారు. ఒకరోజు తిరుమలనంబి యధాప్రకారం స్వామివారి సేవ కోసం పాపవినాశనం నుండి జలాన్ని కుండలో మోసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వేటగాని రూపంలో వచ్చి నంబిని ”తాతా” (అయ్యా) అని పిలుస్తూ దాహం తీర్చుకోవడానికి ఆ బిందెలోని నీటిని కోరాడు. తిరుమలనంబి ఇవ్వకపోవడంతో బిందెకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి వేటగాని రూపంలో ఉన్న స్వామి సంత ప్తి పొందాడు. ఈ చర్యతో ఖిన్నుడైన తిరుమలనంబిని చూసి స్వామి ఓదార్చుతూ సమీపంలో ఉన్న కొండపై బాణం వేసి అందులోనుండి తీయని పానీయం వచ్చేలాగా చేసాడు. నంబిని ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ ”ఇకపై ఈ తీర్థ జలాన్నే నాసేవకు ఉపయోగించాలని పలికి” అంతర్థానమయ్యారు. అప్పుడు తనకు ప్రత్యక్షమైన వ్యక్తి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారేనని తిరుమలనంబి గ్రహించి ఎంతో ఆనందం చెందాడు. అప్పటినుండి ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఆకాశగంగ తీర్థాన్ని శ్రీవారి సేవల కోసం వినియోగిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.