TTD EO REVIEWS ON SRI GOVINDARAJA SWAMY BRAHMOTSAVAM ARRANGEMENTS _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలపై తితిదే ఈఓ సమీక్ష
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలపై తితిదే ఈఓ సమీక్ష
తిరుపతి, మే 02, 2013: తిరుపతిలో మే 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం గురువారం ఆలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 17న ధ్వజారోహణం, మే 21న గరుడ వాహనం, మే 24న రథోత్సవం, మే 25వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయాలని, ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయాలని ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని ముఖ్యమైన కూడళ్లను, ఆలయాన్ని విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించాలని విద్యుత్ విభాగం అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు ఏర్పాటుచేయాలని గార్డెన్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని అన్నదానం క్యాటరింగ్ అధికారిని కోరారు. మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు స్థలపురాణం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు ఈవో తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా ఆలయ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో అన్నమయ్య సంకీర్తనల రాగిరేకులను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.