TTD FOR SPECIAL PUJA IN TIRUCHANOOR ON VARALAKSHMI VRATAM _ ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం నిర్వహణపై తితిదే జెఈవో సమీక్ష
ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం నిర్వహణపై తితిదే జెఈవో సమీక్ష
తిరుపతి, ఆగస్టు 07, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో జరిగిన ఈ సమీక్షలో జెఈవో మాట్లాడుతూ రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) వరలక్ష్మీవ్రతంలో పాల్గొనవచ్చన్నారు. ఇందుకోసం ఆగస్టు 11వ తేదీ నుండి తితిదే ఈ-దర్శన్ కౌంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఆగస్టు 12వ తేదీ నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల కౌంటర్‌లో టికెట్ల విక్రయం ప్రారంభమవుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం భక్తుల భజనలు, కోలాటాల నడుమ స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పది వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేసినట్టు తెలిపారు. పవిత్రమైన వరలక్ష్మీవ్రతంలో స్థానిక మహిళలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, సేవల విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శివారెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాథ్ ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.