TTDs JEO LAUNCHES “PARAKAMANI SEVAKULU” ON-LINE REGISTRATION ON TTD WEBSITE _ తితిదే పరకామణి సేవకుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించిన జెఈఓ
తితిదే పరకామణి సేవకుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించిన జెఈఓ
తిరుమల, 2012 ఆగస్టు 7: తిరుమల శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను లెక్కించేందుకు గాను తితిదే ప్రారంభించతలపెట్టిన పరకామణి సేవకులకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి పరకామణి సేవలను వినియోగించుకోవడం ప్రారంభించనున్నట్టు తెలిపారు. సేవచేయగోరు భక్తులు తితిదే నిర్దేశించిన విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కాగా ప్రారంభథగా ఈ విధానాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలిపారు. మొదట రిజిస్టర్ చేసుకున్న 50 మంది భక్తులకు పరకామణి సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం ఆయన పరకామణి సేవ గురించి తెలుపుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం తితిదే ఉద్యోగులు మరియు బ్యాంకు ఉద్యోగులచే పరకామణి విభాగంలో శ్రీవారి హుండీ ఆదాయాన్ని లెక్కించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈ విధానాన్ని మరింత బలోపేతం, వేగవంతం చేయడంలో భాగంగా భక్తులకు కూడా ఈ అవకాశాన్ని అందించాలని తితిదే యాజమాన్యం నిర్ణయించినట్టు వివరించారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా తితిదే రూపొందించిన విధివిధానాలకు కట్టుబడి ఉండాలని కోరారు.
పరకామణి సేవకులకు విధి విధానాలు :
– పరకామణి సేవ కోసం నమోదు చేసుకునే వారిని ”పరకామణి సేవకులు”గా వ్యవహరిస్తారు.
– పరకామణి సేవకు నమోదు చేసుకునేందుకు పురుషులు మాత్రమే అర్హులు.
– పరకామణి సేవకుల వయసు 35 నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలి.
– పరకామణి సేవకులు హిందూ మతానికి చెందినవారై ఉండాలి.
– పరకామణి సేవకులు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. అర్ధరైటిస్, నడుం నొప్పి, ఆస్తమా లాంటి
వ్యాధులు ఉండకూడదు. వీరు చాలా సమయం కూర్చొని పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
– కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పాక్షిక ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు లేదా షెడ్యూల్ బ్యాంకులు లేదా ఇన్సూరెన్స్ సంస్థల్లో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారు లేదా ఉద్యోగ విరమణ పొందినవారు పరకామణి సేవకు నమోదు చేసుకోవచ్చు.
– పరకామణి సేవ పూర్తిగా స్వచ్ఛంద సేవ మాత్రమే. ఇందుకోసం తితిదే ఏ రూపంలోనూ ఎలాంటి చెల్లింపులు చేయదు.
– పరకామణి సేవకులు సాంప్రదాయ వస్త్రధారణలో ఉండాలి. తెల్ల పంచ మాత్రమే ధరించి పరకామణి సేవలో పాల్గొనాలి.
– ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు చెందిన భక్తులు మాత్రమే ప్రస్తుతం పరకామణి సేవకు అర్హులు.
– పరకామణి సేవకులు మూడు లేదా నాలుగు రోజులు స్లాట్‌కు సిద్ధంగా ఉండాలి.
– మూడు రోజులు స్లాట్ గల పరకామణి సేవ శుక్రవారం మొదలై ఆదివారం ముగుస్తుంది. పరకామణి సేవకులు గురువారం మధ్యాహ్నం 2.00 గంటలలోపు తిరుమలలోని శ్రీవారి సేవాసదన్ (ఆర్‌టిసి బస్టాండు లోపల)లో రిపోర్టు చేయాలి.
– నాలుగు రోజులు స్లాట్ గల పరకామణి సేవ సోమవారం మొదలై గురువారం ముగుస్తుంది. పరకామణి సేవకులు ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలలోపు తిరుమలలోని శ్రీవారి సేవాసదన్ (ఆర్‌టిసి బస్టాండు లోపల)లో రిపోర్టు చేయాలి.
– పరకామణి సేవకులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫొటోను(సైజు 100 కె.బికి మించకూడదు), సంబంధిత సంస్థలు జారీ చేసే గుర్తింపుకార్డు/ పెన్షన్‌కార్డు/ధ్రువపత్రాన్ని(
– పరకామణి సేవకులు తమ సేవను ప్రారంభించేటపుడు తితిదే నిఘా మరియు భద్రత అధికారులు తాత్కాలిక గుర్తింపుకార్డులు మంజూరుచేస్తారు. సేవ ముగిసిన వెంటనే ఏరోజుకారోజు తిరిగి అధికారులకు నిఘా మరియు భద్రత అధికారులకు అప్పగించాలి.
– పరకామణి సేవకులు సెల్‌ఫోన్లు, నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన రాళ్లు, వాచీలు, ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు ఇతర విలువైన వస్తువులను తీసుకురాకూడదు.
– తమ సేవలో చివరిరోజు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కల్పిస్తారు.
– పరకామణి సేవకులకు స్లాట్‌లో చివరి రోజున సబ్సిడీ ధర రూ.10/- చొప్పున మూడు శ్రీవారి లడ్డూలు అందజేస్తారు.
ఈ సమావేశంలో ఎస్‌ఇ-2 శ్రీ రమేష్‌రెడ్డి, ఇడిపి ప్రత్యేకాధికారి శ్రీ బాలాజీ, పరకామణి డెప్యూటీ ఈవో శ్రీమతి శారద, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ మునిరత్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.