UTLOTSAVAM PERFORMED WITH GAIETY IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవ వేడుకలు
తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవ వేడుకలు
తిరుమల, 29 ఆగష్టు : అఖిల వేదాంతవేద్యుడైన శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతి సంవత్సరం శ్రావణ బహుళాష్టమినాడు గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించి మరునాడు ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితి. గురువారంనాడు ఈ ఉట్లోత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను రద్దు చేసింది.
ఈ ఉత్సవాన్ని తిలకించడానికి సాక్షాత్తు శ్రీ మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ దాదాపు 16 ప్రాంతాల్లో తిరుగాడుతూ ఉత్సాహంగా తిలకించారు.
ముందుగా ప్రాతఃకాలారాధనం, మధ్యాహ్నికారాధనం అయిన తరువాత ఈ ఉత్సవమూర్తులు ముందుగా పెద్దజీయంగార్ మఠానికి వేంచేయగా ఆరగింపు హారతి, బహుమాన నివేదనలు నిర్వహించారు. అనంతరం హథీరాంజీ మఠానికి, అటుపిమ్మట కర్ణాటక సత్రాలు వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఉత్సవర్లు కలియతిరుగుతూ ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఆద్యంత కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు ఉల్లాసంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగులగొట్టారు.
సర్వసాధారణంగా సర్వజగద్రక్షకుడైన స్వామివారి చిద్విలాసాన్ని తిలకించి పులకించడం భక్తుల వంతైతే ఉట్లోత్సవంనాడు భక్తుల ఉత్సాహాన్ని తిలకించి ఆనందించడం స్వామివార్ల వంతు కావడం విశేషం.
ఈ కార్యక్రమంలో తి.తి.దే. కార్యనిర్వహణాధికారి శ్రీ యమ్.జి.గోపాల్, ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.