Valedictory function of Training Classes in “IDOL WORSHIP” for members of Girijan community _ ఎస్.సి, ఎస్.టి విద్యార్థులకు వేదవిద్య అవకాశంపై సర్వత్రా హర్షం
ఎస్.సి, ఎస్.టి విద్యార్థులకు వేదవిద్య అవకాశంపై సర్వత్రా హర్షం
తిరుపతి ఫిబ్రవరి-11,2009: తితిదే వేదపాఠశాలల్లో ఎస్.సి, ఎస్.టి విద్యార్థులకు సైతం వేదవిద్యను అభ్యసించే అవకాశం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నట్లు తితిదే భాగవతం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ‘శ్వేత’ నందు గిరిజన గొరవలకు అర్చక విధానంపై పునశ్చరణ తరగతులు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలంలో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయని, కాలానుగుణంగా సమాజంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నా సమభావం కొరవడుతున్న రోజుల్లో తితిదే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా అవి అట్టడుగు వర్గాల వారికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఎవరికైతే విజ్ఞానం అందలేదో వారికి క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పరచాల్సిన అవసరం ఉందని, కానిచో జాతి మొత్తం తిరోగమన దిశగా పయనిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు. 1920 సంవత్సరంలో ‘పూజా పంచరత్నమాల’ అను గ్రంథాన్ని ఒక మహనీయుడు వ్రాయగా, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయని, అదేవిధంగా 1985లో కంచి పీఠాధిపతి పూజావిధానాన్ని తెలిపే ఒక గ్రంథాన్ని తమిళం నుండి తెలుగులోనికి అనువదించమని చెప్పగా, కొన్ని వేల ప్రతులను ముద్రించి పంచడం జరిగిందని తెలిపారు. తద్వారా కొన్నివేల మందిగా పూజా విధానం గూర్చి తెలుసుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన శ్వేతడైరెక్టర్ గిరిజన గొరవలు శిక్షణా కార్యక్రమం ద్వారా చక్కటి క్రమ శిక్షణ, మంచి అలవాట్లను నేర్చుకొని పాటించాల్సిన అవసరం వుందని తెలిపారు. అదేవిధంగా ధర్మానికి కట్టుబడి సామాజిక మార్పుకు దోహదపడాలని ఆయన వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన ఐక్యవేదిక అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రామక్రిష్ణ, వినాయక్‌లు, తెలుగు లెక్చరర్ శ్రీసాకం నాగరాజు, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుండి విచ్చేసిన దాదాపు 50 మంది గిరిజన గొరవలు పాల్గొన్నారు. అనంతరం వీరికి పంచపాత్రలు, బట్టలు, సర్టిఫికెట్లు శ్రీవారి ప్రసాదాలు పంపిణీ చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.