తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2019 ఆగస్టు 07: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం వద్ద విశేషంగా విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపట్టారు. రూ.500/- చెల్లించి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు(ఇద్దరు) ఒక ఉత్తరియం, ఒక రవికె, రెండు లడ్డూలు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెల్లవారుజామున 1.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మెల్కొలిపి, సహస్రనామ అర్చన, నిత్యఅర్చన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 3.30 నుంచి 5 గంటల వరకు అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు భక్తుల భజనలు, కోలాటాల నడుమ అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.