VETURI PRABHAKARA SHASTRY JAYANTHI OBSERVED _ విద్యార్థులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మార్గాన్ని అనుస‌రించాలి : కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ‌

Tirupati, 7 February 2021: The 133 Jayanthi of the renowned scholar Sri Veturi Prabhakara Shastry was observed by TTD in Tirupati.

Considered as the chief architect for popularising Srivaru in the world of Bhakti, Sri Shastry made impeccable contributions in glorifying Lord Venkateswara.

On this occasion, floral tributes were paid to the life-size bronze statue of the eminent scholar located in front of SVETA Bhavan in Tirupati by former Purana Ithihasa Project Special Officer Dr Samudrala Lakshmaiah on Sunday.

Speaking on the occasion Sri Lakshmaiah said, Sri Veturi Prabhakara Shastry transcribed the inscriptions and Annamacharya Sankeertans and did great service to literature.

He said, it give him immense pleasure to note that TTD is remembering and honouring the services of great personalities by observing their birth and death anniversaries in a befitting manner.

Later, scholars met at SV Oriental College and recalled the services of Sri Shastry and his contributions to TTD and literature.

Registrar SV Vedic University Sri Ramachandra, Oriental College Principal Sri Surendra and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విద్యార్థులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మార్గాన్ని అనుస‌రించాలి :  కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ‌

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 07: క‌విగా, ర‌చ‌యిత‌గా, తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌కుడిగా తెలుగు సాహితీరంగంలో త‌న‌దైన ముద్ర వేసిన శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి చూపిన‌ మార్గాన్ని ఎస్వీ ఓరియంట‌ల్ క‌ళాశాల విద్యార్థులు త‌ప్ప‌క అనుస‌రించాల‌ని కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ కోరారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 133వ జయంతిని ఆది‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద‌యం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు.

అనంత‌రం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల తెలుగు అధ్యయన విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో స్మారకోపన్యాస సభ జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ తిరుమ‌ల శ్రీ‌వారిపై అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి శ్రీ ప్రభాకరశాస్త్రి కృషి చేశార‌ని చెప్పారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయ‌న ప‌ద్య సాహిత్యంతోపాటు క‌థ‌లు, క‌థానిక‌లు కూడా ర‌చించార‌ని వివ‌రించారు.

టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు విశ్రాంత ప్ర‌త్యేకాధికారి డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య మాట్లాడుతూ ఆంధ్ర వాఙ్మ‌య విస్తృతికి వేటూరి వారు ఎంతో కృషి చేశార‌ని, గ్రంథ విమ‌ర్శ‌న‌లో ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటి రార‌ని చెప్పారు. తాను 8 శ్లోకాల‌తో ర‌చించిన శ్రీ ప్ర‌భాక‌ర అష్ట‌కంలో వారి వ్య‌క్తిత్వాన్ని పూర్తిగా ఆవిష్క‌రించాన‌ని, విద్యార్థులు దీన్ని చ‌ద‌వాల‌ని కోరారు. వేటూరి వారు ర‌చించిన 58 గ్రంథాలు ల‌భించాయ‌ని, ఇంకా కొన్ని ల‌భించాల్సి ఉంద‌ని తెలిపారు.
       
  టిటిడి ముఖ్య అంక‌ణీయ అధికారి శ్రీ కె.శేష‌శైలేంద్ర మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య రంగాల్లో విస్తృతంగా పరిశోధన చేసి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి త‌న ఉనికిని చాటార‌ని చెప్పారు. తన రచనలతో సమాజాన్ని ఎంతగానో చైతన్యపరిచారని తెలిపారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టిటిడికి అందజేశారని వివరించారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనాంశాలుగా మార్చుకోవాలని సూచించారు.

 ఎస్వీయూ సంస్కృత విభాగాధ్య‌క్షులు ఆచార్య జి.ప‌ద్మ‌నాభం మాట్లాడుతూ శ్రీ ప్ర‌భాక‌ర శాస్త్రి కృషి వ‌ల్ల‌నే ఎస్వీ వ‌ర్సిటీలోని ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌స్తుతం దాదాపు 40 వేల గ్రంథాలు ఉన్నాయ‌ని తెలిపారు. పురాత‌న తాళ‌ప‌త్రాల‌ను చాలా వ‌ర‌కు ప‌రిష్క‌రించి గ్రంథ ముద్ర‌ణ చేశార‌ని చెప్పారు. వేటూరి వారి ల‌క్ష‌ణాల‌ను అందిపుచ్చుకుని విద్యార్థులు జీవితంలో రాణించాల‌ని కోరారు.

 స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించిన క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బానోత్ సురేంద‌ర్ మాట్లాడుతూ శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర శాస్త్రి బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అని, వారి జ‌యంతి, వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా స్మార‌కోప‌న్యాస స‌భ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. 1939వ సంవ‌త్స‌రంలో వీరు ప్రాచ్య క‌ళాశాల‌లో తెలుగు అధ్య‌య‌న విభాగాన్ని ప్రారంభించార‌ని తెలిపారు. అన్న‌మ‌య్య జ‌యంతి ఉత్స‌వాల‌కు కూడా వీరు నాంది ప‌లికార‌ని వివ‌రించారు. వేటూరి వారి సాహిత్యాన్ని ప్ర‌జ‌ల‌కు అందించేందుకు 2007లో టిటిడి శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి వాఙ్మ‌య‌పీఠాన్ని ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. అనంత‌రం ప‌లు అంశాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.

శ్రీ వేటూరి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

 ఈ సంద‌ర్భంగా ఉద‌యం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి విగ్రహానికి టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు విశ్రాంత‌ ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ బానోత్‌ సురేందర్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ రిజిస్టార్ శ్రీ రామ‌చంద్ర త‌దిత‌రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో క‌ళాశాల గ్రంథాల‌యాధికారి శ్రీ జాటోత్ భాస్క‌ర్‌, ఇతర అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.