మొదటి కనుమ రోడ్డులోని శ్రీవినాయక ఆలయంలో ఘనంగా చవితి పూజ

మొదటి కనుమ రోడ్డులోని శ్రీవినాయక ఆలయంలో ఘనంగా చవితి పూజ

తిరుపతి, 2017 ఆగస్టు 25: తిరుమల మొదటి కనుమ రోడ్డులో గల శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చవితి పూజ ఘనంగా జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చలువపందిళ్లు వేసి ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు కనుమ రోడ్డులో ప్రయాణించేటపుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా చేరేలా చూడాలని, టిటిడి తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. 1943వ సంవత్సరం నుంచి ఇక్కడ వినాయక చవితి పూజలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు శ్రీవారి ఆశీస్సులతోపాటు వినాయకుని ఆశీస్సులు కోరుకున్నట్టు చెప్పారు. అధికారులు విధి నిర్వహణలో భాగంగా నిత్యం తిరుమల, తిరుపతి మధ్య కనుమ రోడ్డులో ప్రయాణిస్తుంటారని, రవాణా విభాగంలోని డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా వాహనాలు నడుపుతూ వారికి సహకరిస్తున్నారని వివరించారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఆ వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి మంచి జరిగేలా చూడాలని ఆకాంక్షించారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, డిఐ శ్రీ భాస్కర్‌ నాయుడు, ఇతర అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.