VISHWAKSENA VERIFIES THE ARRANGEMENTS _ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
ANKURARPANAM HELD
Tirumala, 03 October 2024: Vishwaksena, the Commander in Chief of Sri Venkateswara Swamy took out a celestial ride on Golden Tiruchi to verify the arrangements for the mega festival of his Master on Thursday evening.
After the traditional Senapati Utsavam, Mritsangrahanam followed by Ankurarpanam or Beejavapanam the Seed Sowing ritual was observed.
As per the tenets of Vaikhanasa Agama, the sprouting of the seeds depicts the grandeur of the annual fete.
TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdhary, JEOs Smt Goutami, Sri Veerabrahmam, CVSO Sri Sridhar, temple DyEO Sri Lokanatham and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల, 2024 అక్టోబరు 03: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
విశిష్టత..
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
సూర్యాస్తమయం తరువాతే..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీదర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది